దేశంలో ఇటీవల ఆవిష్కరించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలనా మార్గదర్శకాలు దేశ సాంకేతిక నియంత్రణ విధానంలో కీలకమైన మార్పును సూచిస్తున్నాయి. తక్షణమే కఠినమైన చట్టాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం 'ఇన్నోవేషన్-ఫస్ట్' విధానాన్ని అవలంబిస్తున్నట్లు తెలుస్తుంది. దీని ద్వారా ఇప్పటికే ఉన్న చట్టాలకు అనుకూల సవరణలు చేసి ఏఐ వ్యవస్థలను నియంత్రించాలని నిర్ణయించింది. ప్రభుత్వం ప్రత్యేకంగా కొత్త ఏఐ చట్టాన్ని ప్రతిపాదించకుండా ఏఐ వ్యవస్థలను నియంత్రించడంలో ఉన్న లోపాలను గుర్తించడానికి ఇప్పటికే ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000, డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం, 2023 చట్టాలను సమగ్రంగా సమీక్షించాలని పిలుపునిచ్చింది. ఏఐ రంగంలో వేగంగా ఆవిష్కరణలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈమేరకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏఐ వ్యవస్థలు స్వయంగా డేటాను సవరించడం లేదా ఉత్పత్తి చేయడం వల్ల ఇంటర్మీడియరీల (మధ్యవర్తుల) ప్రస్తుత రక్షణ నిబంధనలకు సవాలు ఏర్పడుతుంది. ఏఐ-సృష్టించిన కంటెంట్‌కు ఎవరు బాధ్యత వహిస్తారనే దానిపై నియంత్రణపరమైన స్పష్టత కొరవడింది. ఈక్రమంలో పైన తెలిపిన చట్టాల్లో ఈమేరకు సవరణలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సమస్యను పర్యవేక్షించడానికి ప్రభుత్వం సంస్థాగత ఫ్రేమ్ వర్క్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఏఐ గవర్నెన్స్ గ్రూప్(ఏఐ గవర్నెన్స్‌ను పర్యవేక్షించే ప్రధాన సంస్థ), టెక్నాలజీ అండ్ పాలసీ ఎక్స్‌పర్ట్ కమిటీ (TPEC-నిర్దిష్ట చట్టపరమైన లోపాలను గుర్తించడం, సవరణలను ప్రతిపాదించడం, అమలును పర్యవేక్షించడం) వంటి వాటిని ప్రతిపాదించింది.
0 Comments