ఏఐ వల్ల ఉద్యోగులు పోతాయని భయపడుతున్న వైట్‌కాలర్ ఉద్యోగాలతో పోలిస్తే నైపుణ్యం కలిగిన ట్రేడ్‌ల్లో పని చేస్తున్న వారిపై దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా అంచనా వేస్తున్నారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఏఐ వల్ల వైట్‌కాలర్ ఉద్యోగులకు భారీగా లేఆఫ్స్ ఉంటాయని భయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ కొన్ని అంశాలను పంచుకున్నారు. 'దశాబ్దాలుగా మనం డెస్క్ ఉద్యోగాలను ఉన్నత స్థానాల్లో ఉంచాం. అదే సమయంలో నైపుణ్యం కలిగిన ట్రేడ్ ఉద్యోగాలను ఎక్కువగా ఎదగనివ్వలేదు. అయితే ఏఐకి భర్తీ చేయడం సాధ్యం కాని ఉద్యోగాలు ఇవే అని గుర్తుంచుకోవాలి. ఈ ఉద్యోగాలకు నైపుణ్యం చాలా అవసరం. రియల్‌టైమ్ అనుభవం ముఖ్యం. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, మెకానిక్‌లు, ట్రక్కు డ్రైవర్లు వంటి నైపుణ్యం గల కార్మికులను ఏఐ భర్తీ చేయలేదు' అని చెప్పారు. మహీంద్రా హెచ్చరికలకు బలం చేకూర్చేలా ఫోర్డ్ మోటార్ కంపెనీ సీఈఓ జిమ్ ఫార్లే కూడా ఇదే తరహా ప్రతిభ కొరతను ఎత్తి చూపారు. ఓ పాడ్‌కాస్ట్‌లో ఫార్లే మాట్లాడుతూ. ఫోర్డ్‌లో ప్రస్తుతం 5,000 మెకానిక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు సంవత్సరానికి 1,20,000 డాలర్లు వరకు చెల్లిస్తున్నప్పటికీ, వాటిని భర్తీ చేయడానికి సరైన అభ్యర్థులు లభించడం లేదని ఆయన తెలిపారు. ఈ సంక్షోభం ఫోర్డ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. అమెరికా అంతటా ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్, ట్రక్కు డ్రైవింగ్, ఫ్యాక్టరీ ఆపరేషన్లతో సహా కీలకమైన రంగాలలో 10 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. డెలాయిట్, ది మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్‌స్టిట్యూట్ చేసిన అధ్యయనం ప్రకారం 2030 నాటికి యూఎస్‌లో తయారీ రంగంలోనే 21 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయి.
0 Comments