Ad Code

వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలి : సుప్రీంకోర్టు


అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలు, ఆసుపత్రులు, క్రీడా సముదాయాలు, బస్ డిపోలు, రైల్వే స్టేషన్ల నుంచి వీధి కుక్కలను తీసుకెళ్లాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆయా ప్రాంగణాల్లో ఉన్న అన్ని కుక్కలను పట్టుకుని శస్త్రచికిత్స చేయించి, వ్యాక్సిన్ వేయించాలని, శస్త్రచికిత్స తర్వాత వాటిని అదే ప్రదేశాల్లో విడిచిపెట్టరాదని స్పష్టం చేసింది. ఎందుకంటే, శస్త్రచికిత్స తర్వాత వాటిని అదే ప్రదేశాల్లో విడిచిపెడితే సుప్రీంకోర్టు ఇస్తున్న ఆదేశాల ఉద్దేశం వ్యర్థమవుతుందని చెప్పింది. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రజా భద్రతకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వీ అంజారియాతో కూడిన బెంచ్ వీధి కుక్కల కాట్ల కేసులపై విచారణ జరుపుతూ ఈ ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల కేసులో పూర్తి తీర్పు త్వరలోనే వెలువడనుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రెండు వారాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, వైద్య సంస్థలు, ప్రజా రవాణా కేంద్రాలు, క్రీడా మైదానాలను గుర్తించాలని, 8 వారాల్లో వాటిని ఫెన్సింగ్‌లతో కాపాడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతి ప్రాంగణానికి పర్యవేక్షణ బాధ్యత కలిగిన అధికారి ఉండాలని, స్థానిక మున్సిపల్ సంస్థలు, పంచాయతీలు మూడు నెలలపాటు తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని తెలిపింది. అలాగే, భారత జాతీయ రహదారుల అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ) సహా ఇతర రహదారి సంస్థలు రోడ్లపై ఉండే ఇతర పశువులను తీసుకెళ్లి షెల్టర్లలో ఉంచాలని కోర్టు మరోసారి ఆదేశించింది. బెంచ్‌కు సాయం చేస్తున్న అమికస్ క్యూరీ గౌరవ్ అగర్వాల్ సూచనలు తీర్పులో చేర్చనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఇటీవలి విచారణల్లో సుప్రీంకోర్టు జంతు జనన నియంత్రణ నిబంధనలు (ఏబీసీ నియమాలు 2023) అమలులో నిర్లక్ష్యాన్ని విమర్శించింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యాలయాలు, సంస్థల్లో వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నారని నివేదికలు రావడంతో నవంబర్ 3న జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై తాము కొత్త ఆదేశాలు ఇవ్వబోతున్నామని బెంచ్ పేర్కొంది.

Post a Comment

0 Comments

Close Menu