ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ పరిధి, చునార్ రైల్వే స్టేషన్ లో తీర్థయాత్ర కోసం వచ్చిన యాత్రికులు పట్టాలు దాడుతుండగా రైలు ఢీకొట్టింది. కార్తీక పౌర్ణమి కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు చునార్‌కు వచ్చారు. చునార్ స్టేషన్ లోని ప్లాట్ ఫామ్ నంబర్ 4 దగ్గర చోపాన్-ప్రయాగ్ రాజ్ ప్యాసింజర్ రైలు నుంచి దిగారు. అక్కడి నుంచి మరో ప్లాట్ ఫారమ్ మీదికి వెళ్లాలనుకున్నాడు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీది నుంచి కాకుండా ట్రాక్ మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలోనే దూసుకొచ్చిన కల్కా- హౌరా ఎక్స్ ప్రెస్ రైలు వారిని ఢీకొట్టింది. రైలు వేగంగా రావడంతో స్పాట్ లోనే ఆరుగురు చనిపోయారు. రైల్వే స్టేషన్ ప్రాంతం అంతా రక్తసిక్తం అయ్యింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మీర్జాపూర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలన్నారు. గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని కూడా సీఎం యోగీ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సీఎం యోగి సంతాపం తెలిపారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. అటు ఈ ఘటనపై రైల్వే యంత్రాంగం దర్యాప్తునకు ఆదేశించింది. పోలీసులు, రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రయాణికులు తమ ప్రాణాలను పణంగా పెట్టవద్దని, భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. ప్లాట్ ఫారమ్ లు మారేందుకు ఫుట్ ఓవర్‌బ్రిడ్జిలను మాత్రమే ఉపయోగించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.
0 Comments