చెన్నైలోని ఐఐటీ మద్రాసు క్యాంప్‌సలో 'కాశీ తమిళ సంఘం 4.0'ను తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కాశీ తమిళ సంగమం ప్రధాన మంత్రి మోడీ దీర్ఘకాల దృష్టి అని అన్నారు. ఆధ్యాత్మిక రాజధాని కాశీతో, దేశంలోని అన్ని ప్రాంతాలకు సంబంధాలున్నాయని తెలిపారు. కాశీ తమిళ సంగమం లాంటి కార్యక్రమం నిర్వహించడం కష్టతరమైనదన్నారు. ప్రజలను ఎంపిక చేసి వారిని తీసుకెళ్లడం సామాన్య విషయం కాదన్నారు. ఈ పనులను ఐఐటీ డైరెక్టర్ కామకోటి చక్కగా నిర్వహించారని కొనియాడారు. సంస్కృతి అనేది ప్రభుత్వం నడిపేది కాదని, అది ప్రజల నుంచి పుడుతుందన్నారు. అలాంటి దానిని రాజకీయం చేయవద్దని సూచించారు. ఈ ఏడాది కాశి తమిళ సంగమం వేడుకలు 'తమిళం నేర్చుకోండి' అనే శీర్షికన నిర్వహించనున్నామన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి 300 మంది విద్యార్థులు తమిళం నేర్చుకునేందుకు రాష్ట్రానికి వచ్చారని తెలిపారు. ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తమిళం నేర్చుకునేలా కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోందన్నారు. అసోం నుంచి వచ్చిన విద్యార్థులకు రాజ్ భవన్‌లో తమిళం నేర్పించామన్నారు. 'ఒకే భారతం - అత్యున్నత భారతం' అనేది రాజకీయ నినాదం కాదని గుర్తించుకోవాలన్నారు. ఒకే కుటుంబ సభ్యులు కలిగిన పవిత్ర దేశమని, సాంస్కృతిక వారసత్వాన్ని, మనం కోల్పోయిన వాటిని తిరిగి పొందేందుకు ప్రయత్నించాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
0 Comments