లండన్‌లో క్రౌబేర్‌కు చెందిన 65 ఏళ్ల డెనిస్ బెకన్ గత కొన్నేళ్లుగా పార్కిన్సన్స్‌తో బాధపడుతోంది. రిటైర్డ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపిస్ట్ అయినా ఆమె పార్కిన్సన్స్ నుంచి ఉపశమనం పొందేందుకు కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌లో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నారు. ఆమెకు ఈ వ్యాధి 2014లో నిర్థారణ అయ్యింది. ఫలితంగా నడవడం, ఈత కొట్టడం, డ్యాన్స్ చేయడం వంటివి ఏమి చేయలేకపోయింది. ఐదేళ్ల నుంచి తను ఎంతో ఇష్టపడే గ్రిన్‌స్టెడ్ కచేరీ బ్యాండ్ ప్రదర్శనలో సైతం పాల్గొనడం మానేసిందామె. ఆ నేపథ్యంలో ఇలా బ్రెయిన్‌కి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంది. ఇది సుమారు నాలుగు గంటల ఆపరేషన్. అందులో భాగంగా వైద్యులు ఆమె పుర్రెకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి శస్త్ర చికిత్స చేస్తున్నారు. మధ్యలో ఆమె చేతి వేళ్లను సునాయాసంగా కదిలించగలగడమే కాకుండా, ఆపరేషన్ చేస్తుండగా మధ్యలోనే క్లారినెట్‌ను అద్భుతంగా వాయించింది. దాన్ని చూసి వైద్యుల సైతం విస్తుపోయారు. బ్రెయిన్ సర్జరీలో భాగంగా ఎలక్ట్రోడ్లు సక్రియం చేస్తుండగా చేతులు కదులుతున్నట్లు గమనించి, ఇలా వాయిద్యాని వాయించాలని భావించానంటోంది. దీని కారణంగా తమ సర్జరీ విజయవంతమని, ఆమె సమస్య నుంచి బయటపడి మెరుగ్గా ఉందని తక్షణమే నిర్థారించగలిగామని వైద్యులు చెబుతున్నారు. అంతేగాదు ఆమె ఆ సాహసం చేయాలనుకోవడం చాలా ప్రశంసించదగ్గ విషయమని అన్నారు. అందుకు సంబంధించిన వీడియోని వైద్యులు నెట్టింట షేర్ చేశారు. నెటిజన్లు సైతం శస్త్రచికిత్స మధ్యలో క్లారినెట్ వాయించడం అంటే అది మాములు ధైర్యం కాదంటూ బెకాన్‌ని కొనియాడుతూ పోస్టులు పెట్టారు.
0 Comments