విశాఖ ఆర్డీవో శ్రీలేఖ, డీఆర్వో భవానీ శంకర్‌ను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డీవో, డీఆర్వో మధ్య ఉన్న విభేదాలు తీవ్రస్థాయిలో రచ్చకెక్కాయి. ఎమ్మార్వో కార్యాలయాల నుంచి డీఆర్వో వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆర్డీవో శ్రీలేఖ నాలుగు రోజుల క్రితం విశాఖ కలెక్టర్‌కు లేఖ రాశారు. ప్రోటోకాల్ పేరుతో నెలనెలా నిత్యావసర సరుకులు పంపాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని, శ్రీకాకుళంలోని ఆర్డీవో కుటుంబానికి కూడా కిరాణా సామాగ్రిని పంపాలని ఉద్యోగులను వేధిస్తున్నారని డీఆర్వో శ్రీలేఖ ఆరోపించారు. కలెక్టర్‌కు ఆర్డీవో రాసిన లెటర్ వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేపింది. ఆర్డీవో తీరుపై జిల్లా అధికారులు అసంతృప్తి వ్యక్తం చేయగా, కూటమి ఎమ్మెల్యేలు ఏకంగా ఏపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు పెందుర్తి మండలంలో ఓ విగ్రహం తొలగింపునకు ప్రయత్నం చేశారన్న ఆరోపణలతో ఆర్డీవోకి కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇవ్వడం కూడా చర్చనీయాంశమైంది. ఆయా పరిణామాలతో ఏపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఆర్డీవో, డీఆర్వోలపై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆర్డీవో, డీఆర్వోలను జీఏడీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. హెచ్‌బీసీఎల్ డిప్యూటీ కలెక్టర్ విద్యాసాగర్‌కు విశాఖ ఆర్డీవోగా, విశాఖ జాయింట్ కలెక్టర్ మయూర అశోక్‌కు డీఆర్వో బాధ్యతలను అప్పగించింది. ఆర్డీవో, డీఆర్వోలను వెంటనే రిలీవ్ చేయాలని విశాఖ కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
0 Comments