బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉన్న అల్పపీడనం క్రమంగా బలపడుతూ తుఫాన్ గా మారుతుంది. థాయ్ లాండ్ ఈ తుఫాన్ కు మోంతా అనే పేరు పెట్టింది. విశాఖపట్నంకు 990 కిలోమీటర్లు, కాకినాడకు వెయ్యి కిలోమీటర్లు, చెన్నైకి 11 వందల కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం అల్పపీడనంగా ఉంది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడుతూ రేపు మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. సోమవారం ఉదయానికి తుఫాన్ గా మారనుంది. ప్రస్తుతం గంటకు 7 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో ఇది కదులుతుంది. 27వ తేదీ నాటికి తుఫాన్ గా మారి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు రానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ మోంతా కదలికలను ఇప్పుడే కచ్చితంగా అంచనా వేయలేం అని, వెయ్యి కిలోమీటర్ల దూరం నుంచి తీరం వైపు వచ్చే క్రమంలో ఇది దిశ మార్చుకునే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. శనివారం నాటి అంచనా ప్రకారం తుఫాన్ మోంతా విశాఖపట్నం - ఒడిశా మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. తుఫాన్ మోంతా ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రాయలసీమతోపాటు మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ మోంతా ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై పాక్షికంగా ఉంటుందని చెబుతున్నారు. వాతావరణం మేఘావృతంగా ఉండటం, జల్లులు, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, తిరువళ్లూరు, రాణిపేట జిల్లాలకు సోమవారం వరకు ఆరంజ్ అలర్ట్ ఇచ్చింది. తుఫాన్ మోంతాతోపాటు ఈశాన్య రుతుపవనాల ప్రభావం తమిళనాడు రాష్ట్రంపై ఉందని, ఈ కారణంగానే భారీ వర్షాలు పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
0 Comments