బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వర్షాలు మరో రెండు రోజులు వర్షాలు కొనసాగుతాయని అంచనా వేసింది. పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల పైన దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు సమీక్ష చేసి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసారు. వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల పరిస్థితిపై మంత్రులు, సీఎస్, ఆర్టీజీ అధికారులతో సీఎం మాట్లాడారు. యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రిని ఆదేశించారు. వర్ష ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని సూచనలు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కాగా, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో ఇప్పటికే కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు సీఎంకు అధికారులు వివరించారు. కాలువ, చెరువు గట్లకు గండ్లు పడకుండా బలహీనంగా ఉన్న చోట్ల పటిష్ట పరచాలని సీఎం సూచించారు. అంటువ్యాధులు వ్యాపించకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సూచనలు చేశారు. వర్షాలు భారీగా కురుస్తున్న ఆరు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పరిస్థితికి అనుగుణంగా కలెక్టర్లు నిర్ణయాలు తీసుకుంటున్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలతో పాటు యానాంలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశముందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
0 Comments