Ad Code

తెలంగాణలో అగ్రికల్చర్‌ పోయి గన్‌ కల్చర్‌ వచ్చింది : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్


హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో  మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కమీషన్ల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అగ్రికల్చర్‌ పోయి గన్‌ కల్చర్‌ వచ్చిందని విమర్శలు గుప్పించారు.రేవంత్‌ రెడ్డి పాలనలో అరాచకం నడుస్తోందని, కాంగ్రెస్‌ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను బెదిరిస్తున్నారని.. అవినీతి విలయతాండవం చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి నివాసం సెటిల్‌మెంట్‌లకు అడ్డాగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు ఏకంగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను బెదిరిస్తున్నారని కేటీఆర్ అన్నారు. అవినీతికి పాల్పడిన ఒక ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే.. స్వయంగా మంత్రి కొండా సురేఖ తన కారులో తీసుకెళ్లి పోలీసుల నుంచి ఆ అధికారిని రక్షించారని కేటీఆర్ ఆరోపించారు. సెటిల్‌మెంట్లు చేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే తుపాకీ ఇచ్చాడంటూ ఏకంగా మంత్రి కుమార్తె చెబుతోందని, దీనికి మించి సాక్ష్యం ఇంకేం కావాలని కేటీఆర్ ప్రశ్నించారు. 'నీకింత, నాకింత' అనే సెటిల్‌మెంట్లు తప్ప రాష్ట్రంలో పాలన లేదని దుయ్యబట్టారు. సీఎం వర్గీయులు, మంత్రి వర్గీయులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నా అంతిమంగా అధికారుల బెదిరింపులు వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. మంత్రుల ఒత్తిడికి తలొగ్గి అధికారులు తప్పులు చేస్తే, భవిష్యత్తులో వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కేటీఆర్ హెచ్చరించారు. ఈ విషయంలో ఐఏఎస్‌ అధికారులు రాజీనామా చేస్తుండటం, పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి బెదిరించడం వంటి సంఘటనలను ఆయన ఉదహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అరాచకాలను నియంత్రించకపోవడంపై కేటీఆర్ పోలీసుల పాత్రను తీవ్రంగా ప్రశ్నించారు. తమకు ఏ బుక్కు లేదని, కేవలం ఖాకీ బుక్కు మాత్రమే ఉందని గతంలో చెప్పిన డీజీపీ శివధర్‌రెడ్డి ఇప్పుడు ఎక్కడ పత్తా లేరని, "ఖాకీ బుక్కు కాకి ఎత్తుకెళ్లిందా?" అని కేటీఆర్ సెటైర్ వేశారు. కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే 20 రోజులు జైల్లో పెట్టిన పోలీసులు సీఎం, మంత్రులు, పారిశ్రామికవేత్తలపై తుపాకీతో బెదిరింపులకు దిగిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. "పోలీసులు ఏం పీకుతున్నారు?" అని తీవ్ర పదజాలంతో ప్రశ్నించారు. డీజీపీ శివధర్‌రెడ్డికి మంచి అధికారిగా పేరుందని, ఈ విషయంలో మంత్రి సురేఖ కూతురు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఆధారంగా చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సవాల్ విసిరారు. అంతే కాకుండా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై బీజేపీ తీరును కూడా కేటీఆర్ తప్పుబట్టారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తోందని ఆరోపించారు. ఇంత అరాచకాలు ఓపెన్‌గా జరుగుతున్నా బండి సంజయ్, అమిత్ షా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెడుతుంటే బీజేపీకి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. అలాగే రాష్ట్రానికి సీబీఐ లాంటి సంస్థలు ఎందుకు రావడం లేదని ఆయన అన్నారు. మంచిరేవుల భూముల కోసం గన్ను పెట్టి బెదిరిస్తున్నారని మంత్రి కూతురు స్వయంగా చెప్పారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రౌడీలు, గుండాలను పెట్టుకుని ఊరేగింపులు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

Post a Comment

0 Comments

Close Menu