ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ చేరుకున్నారు. ముఖ్యమంత్రికి స్థానిక తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు బృందం నేటి నుంచి యూఏఈలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘భాగస్వామ్య సదస్సు’కు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులను ఆహ్వానించనున్నారు. దుబాయ్ చేరుకున్న వెంటనే సీఎం చంద్రబాబు అబుదాబి ఇండియన్ ఎంబసీ డెప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్ నాధ్, దుబాయ్ ఇండియన్ కౌన్సిల్ జనరల్ సతీష్ కుమార్ శివన్‌లతో కాసేపట్లో భేటీ కానున్నారు. ఇక తొలిరోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఐదు ప్రముఖ కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్, శోభా గ్రూప్, షరాఫ్ డీజీ సంస్థల ప్రతినిధులతో ఆయన ‘వన్ టు వన్’ సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే ముఖ్యమంత్రి బృందం పలు ప్రాంతాలను సందర్శించనుంది. మ్యూజియం సందర్శనలో భాగంగా ‘జర్నీ టూ 2071’ థీమ్‌తో ఉండే స్పేస్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను పరిశీలిస్తారు. రాత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు సీఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన రోడ్ షోకు హాజరుకానున్నారు. ఈ రోడ్ షోలో పాల్గొని వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. అలాగే నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే పెట్టుబడుల సదస్సుకు వారిని ఆహ్వానించనున్నారు.
0 Comments