Ad Code

తుపాను కారణంగా తీర ప్రాంత జిల్లాల్లోని స్కూళ్లకు మూడు రోజులు సెలవులు


ఆంధ్రప్రదేశ్ లో మొంథా తుపాను కారణంగా తీర ప్రాంత జిల్లాల్లోని స్కూళ్లకు మూడు రోజులపాటు సెలవులు ఇస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 27,28,29 తేదీల్లో సెలవులు ఇచ్చారు. అలాగే తూర్పు గోదావరి, అన్నమయ్య జిల్లాల్లో ఈ నెల 27,28 న సెలవులు ప్రకటించారు. విద్యార్థులు సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచనలు చేశారు. తుపాను నేపథ్యంలో మరిన్ని జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు 'మొంథా' తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న 4 రోజులలో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాన్ని సూచిస్తూ వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలెర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకూ దీని ప్రభావం ఉంటుందని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈ కారణంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పశు సంపదకు నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. రియల్ టైమ్‌ సమాచారాన్ని క్షేత్ర స్థాయి వరకు తీసుకువెళ్లాలని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రతీ జిల్లా కలెక్టర్ తుపాను రక్షణ చర్యలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుని తగిన వనరులతో సన్నద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తీరప్రాంత ప్రజలకు తుఫానుపై అవగాహన కల్పించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచనలు చేశారు. అవసరమైతే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని ఆదేశాలు ఇచ్చారు. మొంథా తుపాను ముప్పుతో దూర ప్రాంతాలకు వెళ్లే వారు ప్రయాణాలు మానుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. భారీ వర్షాలు కురవనుండటంతో మచిలీపట్నం, దివిసీమ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అప్రమత్తం చేశారు. ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో మొంథా తీవ్ర తుపానుగా మారుతుందని, అక్కడ తీరం దాటుతుందని, ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు.

Post a Comment

0 Comments

Close Menu