Ad Code

ఆర్జీ కర్ హత్యాచార దోషి సంజయ్ రాయ్ ఇంట్లోని అల్మారాలో శవమై కనిపించిన మేనకోడలు !


కోల్‌కతా ఆర్జీ కర్ హత్యాచార దోషి సంజయ్ రాయ్ ఇంట్లో 11 ఏళ్ల మేనకోడలు సురంజనా సింగ్ అల్మారాలో శవమై కనిపించింది. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాలలోని అలీపూర్‌లో 11 ఏళ్ల సురంజనా సింగ్ మృతదేహం అల్మారాలో వేలాడుతూ కనిపించింది. స్థానికులు గమనించి తండ్రి, సవితి తల్లిపై దాడికి పాల్పడ్డారు. ఇంట్లో నిత్యం తగాదాలు పడతారని, శారీరకంగా మానసికంగా బాలికను నిత్యం వేధిస్తారని స్థానికులు వాపోయారు. దీంతో తండ్రి భోలా సింగ్, అతని భార్య పూజనే బాలికను చంపేశారంటూ స్థానికులు ఆగ్రహించి చితకబాదారు. సవతి తల్లి జుట్టు పట్టుకుని లాగి కొట్టగా తండ్రిని బూట్లతో కొట్టారు. పోలీసులు వెంటనే వచ్చి దంపతులను రక్షించారు. అనంతరం అలీపూర్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భార్యాభర్తలు నిత్యం గొడవ పడుతూనే ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరూ కలిసి బాలికను చంపేశారని ఆరోపించారు. బాలిక సురంజనా సింగ్.. కోల్‌కతా ఆర్జీ కర్ హత్యాచార దోషి సంజయ్ రాయ్ మేనకోడలు. దీంతో ఈ వార్త మరోసారి సంచలనంగా మారింది. సురంజనా సింగ్ ఐదో తరగతి చదువుతోంది. సవతి తల్లి పూజ దీపావళి రోజున సామాగ్రి కొనేందుకు బయటకు వెళ్లింది. ఇంటికొచ్చేటప్పటికీ సురంజనా సింగ్ మెడలో గుడ్డ ముక్కతో అల్మారాకు వేలాడుతూ కనిపించింది. వెంటనే ఎస్ఎస్‌కేఎం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి చనిపోయినట్లుగా వెల్లడించారు. దీంతో పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో ఆత్మహత్యగా తేలిందని పోలీసులు తెలిపారు. హత్యగా కూడా తోసిపుచ్చలేమని చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నట్లు సీనియర్ అధికారి పేర్కొన్నారు. భోలా సింగ్ మొదట సంజయ్ రాయ్ అక్క బబితను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు సురంజనా సింగ్ జన్మించింది. అయితే కొన్నేళ్ల క్రితం బబిత ఆత్మహత్య చేసుకుంది. అనంతరం బబిత చెల్లెలు పూజను భోలా సింగ్ వివాహం చేసుకున్నాడు. అయితే తండ్రి, సవతి తల్లి నిత్యం సురంజనా సింగ్‌ను మానసికంగా.. శారీరకంగా వేధిస్తూనే ఉంటారని ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలియజేశారు. నిత్యం బాలికను కొడతూనే ఉంటారని వెల్లడించారు. బాలిక అమ్మమ్మ మాట్లాడుతూ… బాలికను బెల్టులతో కొట్టారని.. ఏదో ఒక సాకుతో తలను తరచుగా గోడలకు కొట్టేవారని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.


Post a Comment

0 Comments

Close Menu