యూనివర్సిటీ కాలేజ్ లండన్, మూర్ఫీల్డ్స్ ఐ హాస్పిటల్ పరిశోధకులు నిర్వహించిన క్లినికల్ టెస్టులో ఏఐతో పనిచేసే ఓ చిన్న ఎలక్ట్రానిక్ కంటి ఇంప్లాంట్ సర్జరీతో చూపులేని వారు తిరిగి చదవగలిగారు, వస్తువులను గుర్తించగలిగారు. ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో రూపొందించిన సరికొత్త ఐ ఇంప్లాంట్ క్లినికల్ ట్రయల్స్ లో సంచలన విజయం సాధించింది. ఈ వినూత్న చికిత్స ద్వారా, శాశ్వత అంధత్వాన్ని ఎదుర్కొంటున్న అందులు సైతం మళ్లీ పాక్షికంగా లేదా పూర్తిగా చూడగలుగుతున్నారని పరిశోధకులు ప్రకటించారు. ఈ ప్రయోగం ముఖ్యంగా 'రెటినైటిస్ పిగ్మెంటోసా' వంటి జన్యుపరమైన సమస్యల కారణంగా చూపు కోల్పోయిన రోగులపై జరిగింది. చికిత్సలో భాగంగా, రోగి కంటిలోకి ఒక చిన్నపాటి మైక్రోచిప్ ను శస్త్రచికిత్స ద్వారా అమర్చారు. ఈ చిప్, కృత్రిమ మేధస్సుతో పనిచేసే చిన్న కెమెరాతో కనెక్ట్ చేయబడుతుంది. ఈ కెమెరా వారి ముందు జరుగుతున్న దాన్ని ఫొటోల రూపంలో గ్రహించి, వాటిని డిజిటల్ సిగ్నల్స్ గా మారుస్తుంది. ఈ ఇంప్లాంట్లో ఉన్న ఏఐ అల్గోరిథమ్ లు, రోగి మెదడుకు చేరే సిగ్నల్స్ ను అత్యంత వేగంగా విశ్లేషించి, క్లియర్ ఫొటోలుగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ట్రయల్స్ లో పాల్గొన్న కొందరు రోగులు, ఈ చికిత్స తర్వాత వెలుతురు, వివిధ ఆకారాలు, చివరికి తమ చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా గుర్తించగలిగారు. ఇది తమ జీవితంలో ఓ అద్భుతమని రోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏఐ ఆధారిత సిస్టమ్, దెబ్బతిన్న కంటి రెటీనా స్థానంలో పనిచేస్తుంది. కెమెరా రికార్డ్ చేసిన దృశ్యాలు మైక్రోచిప్ కు చేరతాయి. ఆ చిప్, ఏఐ సహాయంతో ఆ సమాచారాన్ని ఆప్టిక్ నరం ద్వారా మెదడుకు పంపుతుంది. మెదడు ఈ సిగ్నల్స్ ను ప్రాసెస్ చేసి, దృశ్యాలుగా మారుస్తుంది. సాధారణ దృష్టికి దగ్గరగా ఉండే అనుభూతిని ఇవ్వడానికి ఏఐ నిరంతరం చిత్రాలను మెరుగుపరుస్తుంది. ఈ పరిశోధన విజయవంతం కావడం వైద్య చరిత్రలోనే ఒక మైలురాయిగా చెప్పవచ్చు. అంధత్వ నివారణ దిశగా వైద్యులు చేస్తున్న ప్రయత్నాలకు, కృత్రిమ మేధస్సు ఒక నూతన శక్తిని ఇచ్చిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ఇంప్లాంట్ ను మరింత మెరుగుపరిచి, విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి కృషి జరుగుతోంది. త్వరలో ఈ సాంకేతికత ఇతర రకాల అంధత్వానికి కూడా చికిత్స అందించగలదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
0 Comments