Ad Code

కొత్త బ్రౌజర్ "అట్లాస్"ను విడుదల చేసిన ఓపెన్‌ ఏఐ


పెన్‌ఏఐ "అట్లాస్" అనే అత్యాధునిక ఏఐ ఆధారిత వెబ్ బ్రౌజర్‌ను ప్రారంభించింది. ఇది సాధారణ బ్రౌజర్ కాదని, మానవ-యంత్ర సంభాషణను నూతన స్థాయికి తీసుకెళ్తుందని సంస్థ ప్రకటించింది. చాట్‌జీపీటీ ద్వారా ఓపెన్‌ఏఐ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 మిలియన్ల వినియోగదారులను సంపాదించినప్పటికీ, వాటిలో ఎక్కువ మంది ఉచిత వినియోగదారులే. దీంతో సంస్థకు పెద్దగా ఆదాయం రాలేదు. ఈ నేపథ్యంలో ఆర్థిక లాభాలను పెంచుకునే ఉద్దేశ్యంతో ఓపెన్‌ఏఐ "అట్లాస్"ను మార్కెట్‌లోకి తీసుకువచ్చిందని భావిస్తున్నారు. ఇది కేవలం కొత్త ఉత్పత్తి కాదని, ఓపెన్‌ఏఐ వ్యాపార నమూనాను మార్చే ప్రయత్నం కూడా అని అంచనా వేస్తున్నారు. ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ మాట్లాడుతూ  "బ్రౌజర్‌ అంటే ఏమిటి, దానిని ఎలా ఉపయోగించాలి అన్నదానిపై ప్రజలు తిరిగి ఆలోచించేలా 'అట్లాస్' రూపొందించబడింది" అన్నారు. ఇకపై యూజర్లు లింకులు వెతకడం కాకుండా ఏఐతో మాట్లాడడం ద్వారా సమాచారం పొందగలరని పేర్కొన్నారు. అట్లాస్‌లో సాంప్రదాయ యూఆర్ఎల్ బార్ స్థానంలో ఏఐ చాట్ ఇంటర్‌ఫేస్ ఉంటుందని స్పష్టం చేశారు. ఏ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసినా, దాని పక్కన చాట్‌జీపీటీ సైడ్‌బార్ కనిపిస్తుంది. మీరు చదివే కంటెంట్‌ను అర్థం చేసుకోవడానికి, డేటాను విశ్లేషించడానికి ఇది సహాయపడుతుంది. "కర్సర్ చాట్" ఫీచర్‌ ద్వారా యూజర్లు ఇమెయిల్స్‌, పత్రాల్లోని పేరాలను హైలైట్‌ చేసి, వాటిని ఏఐ ద్వారా వెంటనే మెరుగుపరచుకోవచ్చు. అట్లాస్‌ బ్రౌజింగ్ హిస్టరీని సురక్షితంగా గుర్తుంచుకుంటుంది. గతంలో చూసిన సైట్‌ల ఆధారంగా ఏఐ విశ్లేషణ చేస్తుంది. ఉదాహరణకు, ఉద్యోగ వెబ్‌సైట్‌లు చూస్తుంటే, ఏఐ ఆటోమేటిక్‌గా పరిశ్రమ ట్రెండ్‌ల రిపోర్ట్ అందిస్తుంది. హిస్టరీని యూజర్ ఎప్పుడైనా చూడగలరు లేదా తొలగించగలరు. ప్లస్‌, ప్రో, బిజినెస్ వినియోగదారుల కోసం అందుబాటులో ఉన్న ఏజెంట్ మోడ్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది రిజర్వేషన్లు బుక్ చేయడం, ఆన్‌లైన్ షాపింగ్ చేయడం, పరిశోధనలు నిర్వహించడం, లేదా ఫారమ్‌లు నింపడం వంటి పనులను స్వయంగా చేస్తుంది. ప్రస్తుతం ఆపిల్ ల్యాప్‌టాప్‌లలో ప్రారంభమైన అట్లాస్‌, త్వరలో విండోస్‌, ఐఫోన్‌, ఆండ్రాయిడ్ పరికరాల్లో కూడా అందుబాటులోకి రానుంది. ఈ విస్తరణతో ఓపెన్‌ఏఐ, బ్రౌజర్ మార్కెట్లో బలమైన స్థానం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అట్లాస్ ప్రకటన అనంతరం, గూగుల్ స్టాక్ 3% తగ్గింది. పెట్టుబడిదారులు దీన్ని క్రోమ్ ఆధిపత్యానికి భవిష్యత్ ముప్పుగా భావిస్తున్నారు. అట్లాస్ విజయం సాధిస్తే, సెర్చ్ ఇంజిన్ మార్కెట్‌లో గూగుల్ దశాబ్దాల రాజ్యానికి సవాలు అవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu