ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూఏఈలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం యూఏఈలో సీఎం బృందం రేపటి నుంచి మూడు రోజుల పాటు పర్యటిస్తోంది. వచ్చే నెల 14-15వ తేదీల్లో విశాఖలో జరగనున్న పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు వివిధ సంస్థల ప్రతినిధులను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. మూడు రోజుల పర్యటన కోసం రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లనున్నారు. మూడు రోజుల్లో వివిధ అంతర్జాతీయ సంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులతో వన్ టూ వన్ మీటింగ్‌లకు ముఖ్యమంత్రి చంద్రబాబు హజరు కానున్నారు. పారిశ్రామికవేత్తలతో పాటు యూఏఈకి చెందిన ప్రభుత్వ ప్రతినిధులతోనూ సీఎం భేటీ కానున్నారు. రేపు దుబాయ్‌లో సీఐఐ రోడ్ షో కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. దుబాయ్‌లో మూడవ రోజు ఏపీ ఎన్నార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం పాల్గొంటారు. తొలి రోజు పర్యటనలో భాగంగా 22వ తేదీన ఐదు కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ అవుతారు. శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో రేపు సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇండస్ట్రీయల్, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ సదుపాయాలు, పోర్టులు-షిప్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో పెట్టుబడులపై ఆయా సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు చర్చించనున్నారు.ఈ పర్యటనలో పలు ప్రాంతాలను ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సందర్శించనుంది. చంద్రబాబుతో పాటు దుబాయ్ పర్యటనకు మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్థన్ రెడ్డి, సీఎం సెక్రటరీ కార్తికేయ మిశ్రా, ఇండస్ట్రీస్ సెక్రటరీ యువరాజ్, ఏపీ ఇడిబి సీఈఓ సాయికాంత్ వర్మ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ ధాత్రి రెడ్డి వెళ్లనున్నారు. నవంబర్లో నిర్వహించే విశాఖ పార్టనర్‌షిప్ సమ్మిట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది.
0 Comments