కర్ణాటకలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఇటీవల, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బెంగళూర్ సౌత్ ఎంపీ, బీజేపీ తేజస్వీ సూర్యను ''అమావాస్య''గా పిలిచారు. దీనికి తేజస్వీ స్పందిస్తూ సీఎం సిద్ధరామయ్య ''కర్ణాటకకు గ్రహణం'' అని అన్నారు. సిద్ధరామయ్య పాలన రాష్ట్రానికి గ్రహణం లాంటిది అని విమర్శించారు. తనను అమావాస్య, పౌర్ణమిగా పిలువడం ముఖ్యమంత్రికి తగిన మాటలు కావని, ఈ వ్యాఖ్యలు ఆయన పదవికి గౌరవాన్ని తీసుకురావని తేజస్వీ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫమైందని, అవినీతితో కూరుకుపోయిందని ఆయన ఆరోపించారు. బెంగళూర్‌లోని రోడ్లపై ఒక్క కిలోమీటర్ కూడా గుంతలు లేకుండా లేవని తేజస్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం 15 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని కోల్పోయిందని, ప్రభుత్వ ఆర్టీసీ డ్రైవర్లకు వెతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. బెంగళూర్‌లో నెలలో మూడు అత్యాచార కేసులు నమోదయ్యాయని, హోం మంత్రి బెట్టింగ్‌లో బిజీగా ఉన్నారని వ్యాఖ్యానించారు. మంత్రులు ఆర్ఎస్ఎస్‌ను నిషేధించడంలో మునిగిపోయి ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రి కొడుకు యతీంద్ర వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో అంతర్గత పోరాటం జరుగుతోందని తెలుస్తోందని, ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం అసాధ్యం అని తేజస్వీ జోస్యం చెప్పారు. ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే ముందు తన మంత్రిత్వ శాఖ లెక్కలు చూపాలని, ఆర్ఎస్ఎస్ నిషేధం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉందా ? అని ప్రశ్నించారు. సిద్ధరామయ్య పాలన రాష్ట్రాన్ని ఆదాయ లోటుగా మార్చిందని అన్నారు.
0 Comments