బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎట్టకేలకు పశ్చిమ వాయువ్యదిశలో కదిలి బలహీనపడిన తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది రాగల 12 గంటల్లో పశ్చిమ వాయువ్యదిశలో దక్షిణ కర్ణాటక మీదుగా కదిలి తూర్పు మధ్య, దాని సమీపంలోని ఆగ్నేయ అరేబియన్ సముద్రంలోనికి అల్పపీడనం ప్రవేశించే అవకాశం ఉంది. దక్షిణ అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగుతూ సగటు సముద్రమట్టం నుండి 5.8 కి మీ ఎత్తులో ఉపరితల చక్రవాత ఆవర్తనం కొనసాగుతుంది. ఇక నిన్న మొన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దడ పుట్టించిన వానలు తగ్గిన క్రమంలో వాతావరణ శాఖ తాజాగా మరో బాంబ్ పేల్చింది. ఈ రోజు ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న తూర్పు, మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో అక్టోబర్ 27 నుంచి మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఆగ్నేయ, తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తర్వాత వాయుగుండంగా బలపడి తుఫానుగా మారే సూచనలు ఉన్నట్లు తెలిపింది. తుఫాను దక్షిణ కోస్తా లేదా తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మరో నాలుగైదు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది. అంటే అక్టోబర్ 27 నుంచి 29 వరకూ దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడేందుకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. శుక్రవారం (అక్టోబర్ 24) కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
0 Comments