Ad Code

ప్రజల భద్రత కోసం ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగం చిరస్మరణీయం !


తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు చూపిస్తున్న త్యాగం, సేవలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశంసించారు. గోషామహల్‌ పోలీసు గ్రౌండ్స్‌లో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి సీఎం ప్రధాన అతిథిగా హాజరై, విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా 'అమరులు వారు' పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించి, తొలి ప్రతిని డీజీపీ శివధర్‌రెడ్డికు అందజేశారు. పోలీసు అమరవీరుల స్మారక స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించి, పోలీసు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏటా ఈ రోజు పోలీసు అమరవీరులను స్మరించుకుంటున్నాం. పోలీసు అంటే సమాజానికి నమ్మకం, భరోసా. ప్రజల భద్రత కోసం ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగం చిరస్మరణీయమై ఉంటుంది అని అన్నారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఇటీవల విధి నిర్వహణలో మరణించిన కానిస్టేబుల్ ప్రమోద్‌ కుటుంబానికి అన్ని విధాలా సాయం అందిస్తామని తెలిపారు. అమరుల కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రతి అమరవీర కుటుంబానికి ఇంటి స్థలం కేటాయిస్తాం. పిల్లల విద్య, ఉద్యోగావకాశాల విషయంలో ప్రత్యేక సహాయం అందిస్తామ సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర శాంతి భద్రతలను కాపాడటంలో తెలంగాణ పోలీసులు దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉన్నారని సీఎం చెప్పారు. "అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టేందుకు 'ఈగల్‌' పేరుతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. ఈ బృందాలు డ్రగ్స్‌ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి," అని తెలిపారు. మావోయిస్టు సమస్యపై మాట్లాడుతూ ఇటీవల అనేక మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిని స్వాగతిస్తున్నాం. ఇంకా అడవుల్లో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని, ప్రభుత్వ పునరావాస కార్యక్రమాలను వినియోగించుకోవాలని కోరుతున్నామని పిలుపునిచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu