Ad Code

అమరావతికి రెండో విడత నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రపంచ బ్యాంక్


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి భారీగా నిధులు విడుదల చేసేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకుతో కలిపి పనిచేస్తున్న ప్రపంచ బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వానికి సాయం అందిస్తోంది. కేంద్రం గ్యారంటీతో ఇస్తున్న ఈ నిధుల వినియోగంపైనా క్షేత్రస్ధాయిలో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు పర్యటనలు చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు. అమరావతి నిర్మాణ పనులకు రెండో విడతగా ఇస్తామన్న సాయం రూ.1700 కోట్ల విడుదలకు ప్రపంచ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి రెండో విడతగా సుమారు 200 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 1700 కోట్లు విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ నిధుల విడుదలతో రాజధానిలో నిర్మాణ పనులు మరింత వేగవంతం కానున్నాయి. అమరావతి మొదటి దశ నిర్మాణానికి ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు చెరో 800 మిలియన్ డాలర్ల చొప్పున మొత్తం 1600 మిలియన్ డాలర్లు (రూ. 13,600 కోట్లు) సాయం అందించేందుకు అంగీకరించాయి. ఇందులో ప్రపంచ బ్యాంకు ఇప్పటికే ఈ ఏడాది మార్చిలో తొలి విడతగా 207 మిలియన్ డాలర్లను విడుదల చేసింది. ఈ నిధుల్లో దాదాపు 50 శాతం మేర వివిధ పనులకు ఖర్చు చేసినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ వెల్లడించారు. ప్రపంచబ్యాంక్ నిబంధనల ప్రకారం తొలి విడత నిధుల్లో 75శాతం ఖర్చు చేయగానే, రెండో విడత నిధుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో డిసెంబర్ నాటికి ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తన వాటాగా రూ.1400 కోట్లను అందించనుంది. రాజధానిలో పనుల పురోగతిని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బృందాలు ప్రతి నెలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నాయి. పనుల అమలు తీరుపై ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన నివేదికలో సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో రెండో విడత నిధుల విడుదలకు లైన్ క్లియర్ చేసింది. 

Post a Comment

0 Comments

Close Menu