Ad Code

తిరుప్పూరులో బనియన్ల గోదాములుగా మారుతున్న సినీ థియేటర్లు !


మిళనాడు లోని తిరుప్పూరులో సినీ థియేటర్లన్నీ అదృశ్యమవుతున్నాయి. అవి నేడు బనియన్ల గోదాములుగా మారిపోయాయి. ఒకప్పుడు తిరుప్పూరు నగర ప్రధాన చిహ్నంగా వెలుగొందిన యూనివర్శల్‌ థియేటర్‌ ఆనవాళ్లను కూడా గుర్తించలేనంతగా నేలమట్టమైంది. గజలక్ష్మి థియేటర్‌ కూల్చివేయడంతో అక్కడ జౌళి దుకాణం వెలిసింది. పుష్పా ధియేటర్‌ కూల్చివేసి ఎన్నో యేళ్లుగడిచినా ఆ ప్రాంతంలోని బస్టాపును 'పుష్పాథియేటర్‌ సెంటర్‌'గానే పిలుస్తున్నారు. జ్యోతి, ధనలక్ష్మి, రాగం అంటూ మరికొన్ని థియేటర్లు కూడా కూల్చివేశారు.. నటరాజ్‌ థియేటర్‌ బనియన్ల గోదాముగా మారి యేళ్లుగడిచాయి. రామ్‌-లక్ష్మణ్‌ థియేటర్‌ కాంప్లెక్స్‌ కూడా బనియన్ల గోడౌన్లగా మారాయి. ఆ కోవలోనే కొత్త బస్టాండు ప్రాంతంలోని శాంతి థియేటర్‌ను కూడా తాజాగా బనియన్ల గోదాముగా వాడుకునేందుకు నెలసరి అద్దెకిచ్చేశారు. ఈ విషయమై శాంతి థియేటర్‌ యజమాని వి.రంగదురై మాట్లాడుతూ 970 సీటింగ్‌ కెపాసిటీతో థియేటర్‌ నడిపామని, పదేళ్ల క్రితం వరకూ ఏ సినిమా రిలీజ్‌ చేసినా వారం రోజులపాటు రెట్టింపు ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చేవారని, టికెట్లు దొరకకపోతే నిరాశతో తిరిగిపోయేవారని చెప్పారు. తొలినాళ్లలో అయితే ప్రఖ్యాత హీరోల సినిమాలు ప్రదర్శించేటప్పుడు ఫిలిమ్‌ బాక్స్‌ను రథాన్ని ఊరేగించినట్లు నగరమంతా ఊరేగించి థియేటర్‌ వద్దకు చేర్చేవారని, టికెట్ల కోసం క్యూలైన్లలో నిలిచేవారికి హీరోల అభిమాన సంఘాల వారే చల్లటి మజ్జిగ, పండ్ల రసాలను, స్వీట్లను పంచిపెట్టేవారని ఆనాటి పాత సంగతులను జప్తికి తెచ్చుకున్నారు. తిరుప్పూరు నగరంలోని ప్రతి థియేటర్‌లోనూ 20 నుంచి 30 మంది వరకు కార్మికులు పనిచేసేవారని, రోజుకు నాలుగు ఆటలు ప్రదర్శిస్తే ఏ సినిమా అయినా సరే వారం రోజుల్లోనే లాభాల పంట పండించేదని చెప్పారు. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత, ఓటీటీలో సినిమాలు విడుదల చేసే యుగంలోకి ప్రవేశించడంతో ఇకపై సినిమా థియేటర్లను నడపటం ఏ మాత్రం సాధ్యపడదని, ఒక వేళ సాహసించి నడిపినా, గతంలా ప్రేక్షక దేవుళ్ళను రప్పించడం వీలుపడదని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో యేళ్లతరబడి సినిమా థియేటర్లను నడిపిన వారంతా వాటిని కల్యాణమండపాలు, షాపింగ్‌ మాల్స్‌గా మార్చుకుని స్థిరమైన సంపాదనపై దృష్టిసారిస్తున్నారని, ఆనాటి సినీ స్వర్ణయుగం మళ్ళీ తిరిగి రానేరాదని, ఆయన నిట్టూరుస్తూ తెలిపారు. 

Post a Comment

0 Comments

Close Menu