ఆంధ్రప్రదేశ్ లో అర్హులైన ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ ను అందిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన అల్పాదాయ కుటుంబాలకు అందిస్తున్న ఉచిత విద్యుత్ కు సంబంధించి కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మొత్తం 15 లక్షల 17298 మంది ఎస్సీ కుటుంబాలు, 4 లక్షల 75, 557 మంది ఎస్టీ కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19,92,885 మంది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ నెలకు 477. 30 కోట్లు దీనికోసం వినియోగిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు.తక్కువ ఆదాయం ఉన్న వర్గాలకు ఎంతో ఉపయోగంగా ఉన్న ఉచిత విద్యుత్ పథకానికి అడ్డంకులు సృష్టించడానికి కొందరు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మకూడదన్నారు. కూటమి ప్రభుత్వం దళిత గిరిజనుల కోసం అమలు చేస్తున్న పథకాలు అలాగే రాష్ట్రంలో అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాలు చూసి తట్టుకోలేకపోతున్న వైసిపి ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేయిస్తుందని మంత్రి గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా తాము ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్తు పథకాన్ని అందిస్తున్నామని, దళిత గిరిజనులకు మొదట ఈ ఉచిత పథకాన్ని అందించింది టిడిపి ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం అమలు గురించి విధివిధానాల గురించి ఎవరికైనా ఎలాంటి అనుమానాలు ఉన్న 1912 కాల్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవాలని లేనిపోని అపోహలకు పోకూడదని అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.
0 Comments