బెంగళూరు రాజాజీనగరలోని డాక్టర్ రాజ్‌కుమార్ రోడ్ నవరంగ్ జంక్షన్ వద్ద గల మై ఈవీ ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో అగ్నికీలలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక- రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బైక్‌లన్నీ కూడా మాడి మసి అయ్యాయి. అక్కడున్న ఫర్నిచర్ సహా ఏమీ మిగల్లేదు. ఆ సమయంలో షోరూమ్‌లో ఉన్న 20 సంవత్సరాల యువతి మంటల బారిన పడి సజీవదహనం అయ్యారు. మృతురాలిని ప్రియగా గుర్తించారు. మై ఈవీ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో ఆమె రిసెప్షనిస్ట్‌గా పని చేస్తోన్నట్లు సిబ్బంది తెలిపారు. బైక్ బ్యాటరీల్లో షార్ట్ సర్క్యుట్ సంభవించడం వల్ల మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో షోరూమ్‌లో ఎనిమిది మంది వరకు ఉన్నారని తెలుస్తోంది. మంటలు చెలరేగిన వెంటనే వాళ్లందరూ కూడా బయటికి రాగలిగారు. రిసెప్షనిస్ట్ ప్రియ బయటపడలేకపోయారు. ఆమెను కాపాడటానికి శతవిధాలా ప్రయత్నించామని, మంటలు అంతకంతకూ వ్యాప్తి చెందడంతో సాధ్యపడలేదని ప్రవీణ్ అనే యువకుడు తెలిపాడు.
0 Comments