హైదరాబాద్ లోని మియాపూర్ లో 17ఏళ్ల బాలిక మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. తుక్కుగూడలోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమ వద్ద బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాలికను ప్రేమ పేరుతో వలలో వేసుకున్న ఉప్పుగూడ యువకుడు, దొంగతనం కేసులో పాతనేరస్థుడు విఘ్నేశ్ అలియాస్ చింటూ హత్య చేసినట్టు నిర్ధారించారు. ఈ మేరకు హంతకుడు విఘ్నేశ్‌తో పాటు హత్యకు సహకరించిన మరో ఇద్దరిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీఐ క్రాంతికుమార్ కేసు వివరాలను పెల్లడించారు. మియాపూర్ టీఏ నగర్‌కు చెందిన బాలిక(17)కు ఉప్పుగూడకు చెందిన విఘ్నేశ్ అలియాస్ చింటూతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఐదు నెలల క్రితం ఇద్దరు ఫలక్‌నుమాలోని ఓ గుడివద్ద కలుసుకున్నారు. ఆ తర్వాత తరువాత ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసుకుంటూ మరింత స్నేహంగా మారారు. ప్రేమిస్తున్నానంటూ విఘ్నేశ్ ప్రపోజ్ చేయగా ఆ బాలిక అంగీకరించింది. మియాపూర్ వెళ్లిన విఘ్నేశ్ దాదాపు 20 రోజుల క్రితం బాలికను ఉప్పుగూడకు తీసుకెళ్లాడు. విఘ్నేశ్ స్నేహితుడు సాకేత్, కల్యాణి దంపతులకు పరిచయం చేశాడు. దీంతో సాకేత్ ఇల్లు ఖాళీ చేసి కంచన్‌బాగ్‌లోని మరో ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. వీరితో పాటే విఘ్నేశ్, బాలిక నివసించారు. ఆ బాలిక తల్లిదండ్రులతో టచ్‌లోనే ఉంది. ఆమె తల్లిదండ్రులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సదరు బాలిక దాదాపు 10 రోజుల పాటు విఘ్నేశ్‌తో సహజీవనం చేసింది. ఈ క్రమంలో బాలిక ఇతరులతో ఫోన్‌లో మాట్లాడుతున్నదని విఘ్నేశ్ మందలించాడు. ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. పెళ్లి చేసుకోవాలంటూ విఘ్నేశ్‌ను బాలిక నిలదీసింది. బాలికను హత్య చేయాలని విఘ్నేశ్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని సాకేత్, కల్యాణి దంపతులకు చెప్పాడు. పెళ్లి చేసుకుని హత్య చేస్తే ఎవరికీ అనుమానం రాదని వారు సలహా ఇచ్చారు. ఈ నెల 8న విఘ్నేశ్, బాలిక పెళ్లి చేసుకున్నారు. తాను విఘ్నేశ్‌ను పెళ్లి చేసుకున్నానని, వారంలో ఇంటికి వస్తానని ఆ బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. సాకేత్ దంపతులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తర్వాత విఘ్నేశ్ బాలిక తలను గోడకేసి కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన సాకేత్, కల్యాణి సహకారంతో బాలిక మృతదేహాన్ని తుక్కుగూడలోని నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. మరుసటి రోజు 9న బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసిన విఘ్నేశ్.. మీ బిడ్డ ఇంటికి వచ్చిందా అని అడిగాడు. అనుమానం వచ్చిన బాలిక తల్లిదండ్రులు మియాపూర్ పోలీసులకు 10న ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విఘ్నేశ్‌ను విచారించగా నేరం అంగీకరించారు. ఓఆర్‌ఆర్ సమీపంలో కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. విఘ్నేశ్‌తో పాటు సాకేత్, కల్యాణిని పోలీసులు అరెస్ట్ చేశారు.
0 Comments