మహారాష్ట్రలో ఇలాంటి ఫలితాలను తాము ఊహించలేదని కాంగ్రెస్ అధ్యక్షడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. ఈ పరిణామాన్ని లోతుగా పరిశీలించేందుకు, అసలు కారణాలేంటో తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఛత్రపతి శివాజీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావజాలానికి తామే నిజమైన ప్రతినిధులమని, తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఝార్ఖండ్ ప్రజలు మాత్రం తమ హక్కులు, నీరు, అటవీ, భూ సమస్యలకు ప్రాధాన్యమిచ్చారని ఖర్గే పేర్కొన్నారు. అందువల్లే విభజనవాద, నకిలీ రాజకీయాలను తిరస్కరించారన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతామని, ప్రజల గొంతుకను వినిపిస్తామన్నారు. ఝార్ఖండ్‌లో జవాబుదారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఝార్ఖండ్‌లో విజయం సాధించిన హేమంత్ సోరెన్, ఇండియా కూటమికి తమిళనాడు సీఎం స్టాలిన్ అభినందనలు తెలిపారు. అధికార దుర్వినియోగంతో కూడిన ప్రతీకార రాజకీయాలు, గత ఐదేళ్లలో భాజపా అనేక అడ్డంకులు సృష్టించినప్పటికీ.. ధైర్యంగా, దృఢ సంకల్పంతో ఎదురొడ్డి నిలబడిన హేమంత్ విజయం సాధించారని ప్రశంసించారు. అన్ని పార్టీలను కలుపుకొని తీసుకెళ్లే ఆయన నాయకత్వంపై ఝార్ఖండ్ ప్రజలు తమ విశ్వాసాన్ని ఈ ఎన్నికల్లో వ్యక్తపరిచారన్నారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదానికి ఇదో గొప్ప విజయమని అభివర్ణించారు.
0 Comments