ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలకు గ్రాట్యూటీ ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాకుండా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి హామీ ఇచ్చారు. అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అంగన్‌వాడీ కార్మికులతో చర్చించి దశల వారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చారు. వారికి ఇవ్వాల్సిన గ్రాట్యూటీ చెల్లింపు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తాము సానుకూలంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటామని.. సేవలకు మాత్రం ఆటంకం కలగకుండా చూడాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. సమ్మె వలన చిన్నారులు, బాలింతలు, గర్భిణిలు ఇబ్బంది పడుతారనే విషయాన్ని గ్రహించి ఆందోళన విరమించాలని కోరారు. రాష్ట్రంలోని 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో తల్లులు, పిల్లలు, గర్భిణిలకు ఆరోగ్య, పోషకాహార సేవలు అందిస్తున్నట్లు మంత్రి సంధ్యారాణి వివరించారు. సమ్మెలు, ఆందోళనలతో సమస్యలు పరిష్కారం కావని.. దశలవారీగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంగన్‌వాడీ సమస్యల అంశం శాసనమండలిలో కూడా చర్చకు వచ్చింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కోసం 7,090 అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.70 కోట్లు నిధులను విడుదల చేసినట్లు మంత్రి సంధ్యారాణి వివరించారు. రూ.లక్ష చొప్పున రూ.70.90 లక్షల నిధులు విడుదల చేసినట్లు ప్రకటించారు.ఆ నిధులతో ఎల్‌ఈడీ టీవీలు, ఆర్‌ఓ ప్లాంట్లు, బెంచీలు, కుర్చీలు, పిల్లలకు ఆట బొమ్మలు వంటివి అందిస్తామని వెల్లడించారు.
0 Comments