బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్‌ఇండియా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ 67/7 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ స్టార్క్ (26;112 బంతుల్లో 2 ఫోర్లు) టాప్ స్కోరర్. బుమ్రా 5, హర్షిత్ రాణా 3, సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్ రెండో ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (90*; 193 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకానికి చేరువ కాగా, కేఎల్ రాహుల్ (62*; 153 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో రోజు ఆటను ప్రారంభించిన కాసేపటికే ఆసీస్‌కు అలెక్స్ కేరీ రూపంలో షాక్ తగిలింది. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తోన్న అలెక్స్ కేరీ (21)ని బుమ్రా అద్భుతమైన బంతికి ఔట్ చేశాడు. కాసేపటికే నాథన్ లైయన్ (5)ని హర్షిత్ రాణా వెనక్కి పంపాడు. అనంతరం మిచెల్ స్టార్క్ చాలాసేపు భారత బౌలర్లను అడ్డుకొన్నాడు. హేజిల్‌వుడ్ (7*)తో కలిసి పదో వికెట్‌కు విలువైన పరుగులు (110 బంతుల్లో 25 రన్స్) రాబట్టాడు. ఈ క్రమంలో లంచ్ బ్రేక్‌కు ముందు చివరి ఓవర్‌లో హర్షిత్ రాణా బౌలింగ్‌లో స్టార్క్ భారీ షాట్‌కు యత్నించాడు. రిషభ్ పంత్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 46 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలో టీమ్ఇండియా ఓపెనర్లు నెమ్మదిగా ఆడారు. తర్వాత క్రీజులో పాతుకుపోయి క్రమంగా దూకుడు పెంచారు. ఈ క్రమంలో టీ విరామ సమయానికి భారత్ 84/0తో నిలిచింది. చివరి సెషన్‌లో పిచ్ బౌలర్లకు సహకరించడంతో భారత బ్యాటర్లు ఆచితూచి ఆడారు. జైస్వాల్ 123 బంతుల్లో, రాహుల్ 124 బంతుల్లో అర్ధ శతకాలు అందుకున్నారు. తర్వాత కూడా వీరిద్దరూ ఆసీస్ బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా నిలకడగా ఆడి పరుగులు రాబట్టారు.
0 Comments