అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన 'వీ రోబోట్' ఈవెంట్‌లో టెస్లా కంపెనీ ఆప్టిమస్ రోబోను ప్రదర్శించింది. ఇదొక హ్యూమనాయిడ్ రోబో. ఈ ఈవెంట్‌లో ఇలాంటి ఎన్నో రోబోలను ప్రదర్శించారు. అయితే ఆప్టిమస్ రోబోకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అది మనుషులతో స్నేహితుడిలా కలిసిపోగలదు. వారితో మర్యాదపూర్వకంగా సరదాగా ముచ్చటించగలదు. మనుషులు ఏదైనా ఆర్డర్ ఇస్తే ఆ పనిని చేసిపెట్టే నేర్పరితనం ఆప్టిమస్ రోబో సొంతం. ఈ రోబో సెల్ఫీలు తీసుకోగలదు. డ్యాన్స్ కూడా బ్రహ్మాండంగా చేయగలదు. 'వీ రోబోట్' ఈవెంట్ సందర్భంగా టెస్లాకు చెందిన ఆప్టిమస్ రోబో ర్యాంప్‌పై నడుస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఈవెంట్‌కు వచ్చిన వారికి డ్రింక్స్ అందించి, టెక్నికల్‌గా పలకరిస్తూ, విష్ చేస్తూ సందడి చేసింది. 'వీ రోబోట్' ఈవెంట్‌లో టెస్లా యజమాని ఎలాన్ మస్క్ మాట్లాడుతూ ఆప్టిమస్ రోబో ప్రత్యేకతలను వివరించారు. ''ఈ రోబో ప్రాథమికంగా మీకు కావాల్సినదంతా చేస్తుంది. మీకు గురువుగా మారి పాఠాలు నేర్పగలదు. మీ పిల్లలతో ఆడుకోగలదు. వారికి రక్షణ కల్పించగలదు. మీ కుక్కపై నిఘా పెట్టగలదు. మీ పచ్చికను కోయగలదు. మీకోసం కిరాణా సామాన్లను కొనగలదు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు స్నేహితుడిలా పక్కన కూర్చొని మాట్లాడగలదు. మీకు అవసరమైన ఫుడ్, డ్రింక్స్‌ను సమయానికి ఇవ్వగలదు. మీరు ఏది ఆలోచించగలిగితే.. అవన్నీ ఆప్టిమస్ రోబో చేస్తుంది'' అని ఆయన వివరించారు. ఆప్టిమస్ రోబో ధర దాదాపు రూ.17 లక్షల దాకా ఉంటుందని వెల్లడించారు. 'వీ రోబోట్' ఈవెంట్‌కు హాజరైన వారికి ఆప్టిమస్ రోబో సపర్యలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
0 Comments