బెంగళూరు నగరం భారీ వర్షానికి అతలాకుతలమైంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరమంతా జలదిగ్బంధంలో చిక్కుకుంది. నీటి ప్రవాహం కారణంగా పలు రహదారులును అధికారులు మూసివేశారు. బాధితులను రక్షించేందుకు అధికారులు పడవలను వినియోగిస్తున్నారు. మరోవైపు పలువురు బెంగళూరువాసులు సోషల్ మీడియాలో అధికారులపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులోని పలు రహదారుల్లో మోకాళ్ల లోతు మేరకు నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం వరకు బెంగళూరు రూరల్ పరిధిలో 176 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బెంగళూరు అర్బన్ ప్రాంతంలో 157 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా పలు విమాన సర్వీసులు దెబ్బతిన్నాయి. సోమవారం రాత్రి 20కి పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. నాలుగు ఇండిగో విమానాలను చెన్నైకి మళ్లించారు. నగరంలోని పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించారు.
0 Comments