Ad Code

రోడ్లు, జలాశయాలు, రైలు ట్రాక్‌లను ఆక్రమించిన ఏ మత సంబంధ కట్టడాలనైనా తొలగించాల్సిందే : సుప్రీంకోర్టు


రోడ్లు, జలాశయాలు, రైలు ట్రాక్‌లను ఆక్రమించిన ఏ మత సంబంధ కట్టడాలనైనా తొలగించాల్సిందేనని ప్రజల సురక్షితమే అత్యున్నత అంశమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. నేరగాళ్ల ఇళ్లపై బుల్డోజర్‌ చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం జస్టిస్‌ బీఆర్‌ గవయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ నేతృత్వంలోని బెంచి విచారించింది. భారత్‌ సెక్యూలర్‌ దేశమని, ఆక్రమణల తొలగింపు, బుల్డోజర్‌తో చర్యలు మతాలతో సంబంధం లేకుండా అందరికీ ఒక్కటేనని బెంచ్‌ పేర్కొంది. యూపీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు హాజరయ్యారు. ఏదైనా నేరంలో ఉండటమే వ్యక్తి ఇంటిపై బుల్డోజర్‌ చర్యలు తీసుకోవడానికి ఆధారమా ? అని ఆయన్ను బెంచ్‌ ప్రశ్నించింది. దీనికి మెహతా స్పందిస్తూ ''కచ్చితంగా కాదు. అత్యాచారం, ఉగ్రవాదం వంటి నేరాల్లో నిందితులైనా సంబంధం లేదు. ఒక్కరోజు ముందు నోటీసు జారీ చేసి ఇంటి గోడపై అంటించినా పరిగణలోకి తీసుకోం. ఇది ముందే జరిగి  ఉంటేనే చర్యలు తీసుకొంటాం'' అని పేర్కొన్నారు. ఒక వర్గానికి సంబంధించిన కొన్ని ఘటనల ఆధారంగా న్యాయస్థానం మార్గదర్శకాలు జారీచేసిందని తాను ఆందోళన చెందుతున్నట్లు ఆయన వెల్లడించారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ ''మనది సెక్యూలర్‌ దేశం. మా మార్గదర్శకాలు జాతిమతాలతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తాయి. ఇక ఆక్రమణల విషయానికి వస్తే మేము ఇప్పటికే చెప్పాం. ఏదైనా మత సంబంధమైన నిర్మాణం రోడ్డు, ఫుట్‌పాత్‌, జలాశయం, రైలు పట్టాపై ఉంటే అది ప్రజలకు అడ్డంకి కాదా. అక్రమ నిర్మాణాల విషయంలో అందరికీ ఒక్కటే చట్టం'' అని వ్యాఖ్యానించింది. ఇక యూన్‌ రిపోర్టర్‌ సీనియర్‌ అడ్వొకేట్‌ వ్రిందా గ్రోవర్‌ ఇళ్ల లభ్యతపై వాదనలు వినిపించారు. దీనికి సొలిసిటర్‌ జనరల్‌ మెహతా అభ్యంతరం చెబుతూ ''ఈ విషయాన్ని అంతర్జాతీయకరించాల్సిన అవసరం లేదని, దేశ న్యాయస్థానాలకు తగినంత శక్తి ఉందన్నారు. ఈవిషయంలో అంతర్జాతీయ ఏజెన్సీ జోక్యం అవసరం లేదు'' అని పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది సీయూ సింగ్‌ వాదిస్తూ బుల్డోజర్‌ చర్యలను నేరాలపై పోరాడేందుకు ఉపయోగించకూడదని అభ్యర్థించారు. పంచాయతీలకు, పురపాలక కార్పొరేషన్లకు విభిన్నమైన చట్టాలున్నాయని న్యాయస్థానం పేర్కొంది. వీటికి ఆన్‌లైన్‌ పోర్టల్స్‌ ఉండాలని అభిప్రాయపడింది. వాటిల్లో డిజిటలైజ్‌ చేసిన రికార్డులు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. 

Post a Comment

0 Comments

Close Menu