రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఎంతసేపు ఆగుతుందనే విషయంతో సంబంధం లేకుండా రైలు ఇంజన్ ఆన్‌లోనే ఉంచడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా, డీజిల్ ఇంజన్‌ను లోకోపైలట్లు స్విచ్ఛాఫ్ చేయరు. ఒకసారి ఇంజన్ ఆఫ్ చేసి తిరిగి ఆన్ చేయడానికి ఎక్కువ టైమ్ పడుతుంది, ఫ్యూయల్ కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. అంతేగాకుండా స్టార్ట్ చేసిన తర్వాత ఇంజన్ వేడెక్కడానికి దాదాపు అరగంట పడుతుంది. దీంతో పోలిస్తే ఇంజన్‌ను రన్నింగ్‌లోనే ఉంచడం వల్ల సమయం ఆదా కావడంతో పాటు ఇంధనం కలిసొస్తుంది. దీంతో సమయానికి రైలు స్టేషన్ నుంచి బయలుదేరేందుకు అవకాశం ఉంటుంది. ఎలక్ట్రిక్ రైళ్లకు కూడా ఇలాంటి పద్ధతినే పాటిస్తారు. ఒకసారి సిగ్నల్ పడగానే వెంటనే బయలుదేరేలా ఇంజన్ రెడీగా ఉండాలి. అలాకాకుండా ఇంజన్ ఆఫ్ చేసి పెట్టుకుంటే తిరిగి ఆన్ చేసి బయలుదేరడానికి మరికొంత సమయం పడుతుంది. దీంతో సమయం వృథా అయ్యి షెడ్యూల్ వాయిదా పడుతుంది. అంతేగాకుండా పదే పదే ఇంజన్ ఆఫ్ చేసి ఆన్ చేయడం వల్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి, ఇంజన్ పనితీరు దెబ్బతింటుంది. రైలు ఇంజన్‌ను ఆన్‌లోనే ఉంచడానికి మరో ప్రధాన కారణం ఎయిర్ సిస్టం. ఇంజన్‌తో ఈ ఎయిర్ సిస్టం ముడిపడి ఉంటుంది. ట్రైన్ బ్రేక్‌లను ఇది ఛార్జ్ చేస్తుంటుంది. అంటే, ఇంజన్ ఆఫ్ చేస్తే ఎయిర్ సిస్టం కూడా నిలిచిపోయి ఎయిర్ ప్రెజర్ తగ్గిపోతుంది. ఫలితంగా, బ్రేక్ ఫెయిల్యూర్ రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంజన్ ఆఫ్ చేశాక తిరిగి ఆన్ చేస్తే ఎయిర్ సిస్టం పనిచేయడం మళ్లీ ప్రారంభం అవుతుంది. ఇలా ట్రైన్ బ్రేక్ సిస్టంను ఇది ఛార్జ్ చేస్తుంది. ఈ బ్రేక్‌లు పూర్తిగా రీఛార్జ్ కావడానికి దాదాపు అరగంట నుంచి గంట సమయం తీసుకుంటుంది. కాబట్టి, ఈ సమయంలో ప్రయాణికులు వేచిఉండక తప్పదు. అలాకాకుండా, ఇంజన్‌ను రన్నింగ్‌లో ఉంచితే ఈ సమయం ఆదా అవడంతో పాటు బ్రేక్ సిస్టం కూడా నిరంతరం ఛార్జింగ్‌లో ఉండి ప్రమాదాల నివారణకు తోడ్పడుతుంది. సిగ్నల్ పడగానే ట్రైన్ బయలుదేరేలా ఉండేందుకు ఇలా లోకోపైలట్లు ఇంజన్‌ను ఆన్‌లోనే ఉంచుతారు.
0 Comments