ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆన్‌లైన్ వేదికగా ఒకరిపై ఒకరు తీవ్రంగా వాదించుకుంటున్నారు. ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల సర్వీస్ సెంటర్ పరిస్థితిపై కమ్రా ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ వాగ్వాదం ప్రారంభమైంది. ఓలా సర్వీస్ సెంటర్‌లో పెద్ద సంఖ్యలో ఈవీ స్కూటర్‌లున్న ఫొటోను కమ్రా షేర్ చేస్తూ కామెంట్ పెట్టడంతో వివాదం మొదలైంది. ఓలా సర్వీస్ సెంటర్ ముందు పోగైన ఎలక్ట్రిక్ వాహనాలను సూచించే ఫొటో షేర్ చేస్తూ కమ్రా తన ఎక్స్ ఖాతాలో 'భారతీయ వినియోగదారులు సమస్యలపై మాట్లాడలేరని అనుకుంటున్నారా? వారికి ఇలాంటి సమస్యా? రోజువారీ వేతన కార్మికులు ద్విచక్ర వాహనాలు వాడుతూ జీవనాధారం పొందుతున్నారు' అని ఆయన తన పోస్ట్‌లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ట్యాగ్ చేస్తూ 'భారతీయులు ఈవీలను ఎలా ఉపయోగిస్తారు?' అని తెలిపారు. 'పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉన్నా సంస్థ నాయకుడి నుంచి ఎలాంటి సమాధానం లేదు' అని మరోపోస్ట్ పెట్టారు. ఈ వ్యవహారంపై ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ఘాటుగా స్పందించారు. కమ్రా పెట్టిన పోస్ట్‌లు 'పెయిడ్ పోస్ట్'లు అని వ్యాఖ్యానించారు. ఈమేరకు భవిష్ కమ్రా విమర్శలకు ప్రతిస్పందనగా పోస్ట్ చేశారు. 'మీరు ఈవీల వ్యవహారంపై చాలా శ్రద్ధ వహిస్తారు కాబట్టి, వచ్చి మాకు సాయం చేయండి! ఈ 'పెయిడ్ ట్వీట్'లు, విఫలమైన మీ కామెడీ కెరీర్ ద్వారా ఎంత సంపాదిస్తారో అంతకంటే ఎక్కువగానే మీకు డబ్బు ఇస్తాను. ఇవేవీ కాదంటే నిశ్శబ్దంగా ఉండండి. మేము కస్టమర్ల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెడుతున్నాం. సర్వీస్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నాం. బ్యాక్‌లాగ్‌లు త్వరలో క్లియర్ చేస్తాం' అని స్పందించారు. కమ్రా భవిష్ ట్వీట్‌పై తిరిగి స్పందించారు. 'పెయిడ్ ట్వీట్ చేసినట్లు, నేను ఏదైనా ప్రైవేట్ కంపెనీ నుంచి ఈ వ్యవహారానికి సంబంధించి డబ్బు పొందినట్లు మీరు రుజువు చేస్తే నా అన్ని సోషల్ మీడియా అకౌంట్లను వెంటనే తొలగించి, మీరన్నట్లు ఎప్పటికీ నిశ్శబ్దంగా కూర్చుంటాను' అని చెప్పారు. దీనికి అగర్వాల్ బదులిస్తూ 'నేను అన్న మాటలతో బాధపడ్డారా? సర్వీస్ సెంటర్‌కు రండి. మాకు చాలా పని ఉంది. మీ ఫ్లాప్ షోల కంటే నేను బాగా డబ్బులిస్తాను. మీ వ్యాఖ్యలపై నిజంగా మీరెంత శ్రద్ధ వహిస్తున్నారో మీ అభిమానులకు తెలియాలి' అని అన్నారు. దీనిపై కమ్రా బదులిస్తూ 'కస్టమర్ల ఈవీను తిరిగి ఇవ్వాలనుకునే వారికి, గత నాలుగు నెలల్లో ఈవీను కొనుగోలు చేసిన వారికి డబ్బు వాపసు చేస్తారా? మీ డబ్బు నాకు అవసరం లేదు. మీ ఈవీ వాడుతున్న కస్టమర్లు సరైన సేవలందక తమ కార్యాలయాలకు చేరుకోవడం లేదు. దీనికి సమాధానం చెప్పండి. మీరు నిజంగా శ్రద్ధ వహిస్తున్నట్లు మీ కస్టమర్‌లకు తెలియాలి కదా?' అని అన్నారు. దీనిపై భవిష్ స్పందిస్తూ 'మా కస్టమర్‌లకు అందే సర్వీసు జాప్యం జరిగితే వారికి తగినన్ని ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. మీరు నిజంగా సమస్యపై స్పందించాలంటే కేవలం కుర్చీలో కూర్చొని విమర్శలు చేయడం కాదు. సమస్య ఎక్కడుందో తెలుసుకోండి. దీనిపై వెనక్కి తగ్గకండి' అని పోస్ట్ చేశారు.
0 Comments