Ad Code

గూగుల్ సెర్చ్‌లో ఫేక్ వెబ్‌సైట్లకు చెక్ పెట్టేందుకు వెరిఫైడ్ బ్లూ బ్యాడ్జ్ ఫీచర్ ?


గూగుల్ సరికొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొస్తోంది. ఈ కొత్త ఫీచర్ సాయంతో ఫేక్ వెబ్‌సైట్లకు చెక్ పెట్టేయొచ్చు. సాధారణంగా గూగుల్ సెర్చ్‌లో ఏదైనా విషయం గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు అనేక ఫేక్ వెబ్‌సైట్లు కనిపిస్తుంటాయి. అందులో ఏది రియల్ వెబ్‌సైట్, ఏది ఫేక్ అనేది గుర్తుపట్టడం కష్టమే. కొన్నిసార్లు చాలామంది ఫేక్ వెబ్‌సైట్ గురించి తెలియక తమ వ్యక్తిగత వివరాలను ఇవ్వడం ద్వారా సైబర్ నేరగాళ్లకు చిక్కడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి ఫేక్ వెబ్‌సైట్లను సెర్చ్ నుంచి డీలిస్టు చేసేందుకు గూగుల్ కొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొస్తోంది. అదే.. వెరిఫైడ్ బ్యాడ్జ్ ఫీచర్.. అంటే.. మీరు విజిట్ చేసిన ఆ వెబ్‌సైట్ ఫేక్ లేదా రియల్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఒరిజినల్ వెబ్‌సైట్లకు వెరిఫైడ్ బ్యాడ్జ్ కనిపిస్తుంది. దీని ఆధారంగా ఆయా వెబ్‌సైట్లను ట్రస్ట్‌వర్తీ బిజినెస్ వెబ్ సైట్ అని యూజర్లు సులభంగా గుర్తుపట్టవచ్చు. వెరిఫైడ్ వెబ్‌సైట్లను గుర్తించడంతో పాటుమోసపూరిత వెబ్‌సైట్‌లను నివారించడంలో వినియోగదారులకు సాయం చేసేందుకు గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో నిర్దిష్ట కంపెనీల పక్కన చెక్‌మార్క్‌లతో అందించనుంది. ప్రస్తుతానికి గూగుల్ ఈ కొత్త వెరిఫైడ్ చెక్ మార్క్ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. లీగల్ వెబ్‌సైట్ల మాదిరిగా కనిపించే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ఫేక్ వెబ్‌సైట్‌ల నుంచి వినియోగదారులను రక్షించడమే లక్ష్యంగా గూగుల్ ఈ కొత్త సెక్యూరిటీ ఫీచర్ తీసుకొస్తోంది. ఈ మేరకు గూగుల్ ప్రతినిధి ధృవీకరించారు. విశ్వసనీయ బిజినెస్ గుర్తించడంలో వినియోగదారులకు సాయపడేందుకు కంపెనీ క్రమం తప్పకుండా కొత్త ఫీచర్లతో టెస్టింగ్ చేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత టెస్టింగ్‌లో ఈ చెక్‌మార్క్‌లను సెర్చ్ రిజల్ట్స్‌లో వెరిఫైడ్ బిజినెస్ సైట్ల పక్కన బ్యాడ్జ్ కనిపిస్తుంది. మోసపూరిత వెబ్‌సైట్‌లు తరచుగా సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపిస్తాయి. తద్వారా వినియోగదారులు బిజినెస్ లేదా సర్వీసు గురించి తప్పుదారి పట్టించే మోసపూరిత కంటెంట్‌ యాక్సస్ చేస్తారు. అదే వెరిఫైడ్ కంపెనీల సైట్లకు చెక్ మార్కులను అందించడం ద్వారా గూగుల్ ఆయా సైట్ల విశ్వసనీయతను మెరుగుపర్చనుంది. దుకాణదారులకు, సాధారణ వినియోగదారులకు ఆన్‌లైన్ భద్రతను మరింత మెరుగుపరచాలని భావిస్తోంది. ఈ కొత్త ఫీచర్‌తో పాటు, గూగుల్ ఇప్పటికే సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపించకుండా “స్కామీ” లేదా మోసపూరిత పేజీలను గుర్తించి బ్లాక్ చేసేందుకు ఆటోమేటెడ్ సిస్టమ్‌లను ఉపయోగిస్తోంది. ఆన్‌లైన్‌లో బిజినెస్ లేదా సర్వీసుల కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు వినియోగదారులు హానికరమైన కంటెంట్‌ను ఎదుర్కొనే సమస్యను తగ్గించడంలో ఈ సిస్టమ్‌లు సాయపడతాయి. ఈ విషయాన్ని ముందుగా ది వెర్జ్ నివేదించింది. సెర్చ్ రిజల్ట్స్‌లో మైక్రోసాఫ్ట్, మెటా, ఆపిల్ వంటి ప్రధాన కంపెనీల అధికారిక సైట్ లింక్‌ల పక్కన బ్లూ వెరిఫైడ్ చెక్‌మార్క్‌లను చూసినట్లు పేర్కొంది. ఆన్‌లైన్ సెర్చ్ రిజల్ట్స్ నావిగేట్ చేస్తున్నప్పుడు యూజర్లలో విశ్వాసం, భద్రతను మెరుగుపరిచేందుకు గూగుల్ చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ ఫీచర్ అని చెప్పవచ్చు. వెరిఫైడ్ బ్యాడ్జ్ టెస్టింగ్ ప్రస్తుతం పరిమిత పరీక్ష దశలో ఉంది. అన్ని సెర్చ్ రిజల్ట్స్‌లో విస్తృతంగా గూగుల్ ఎప్పుడు అమల్లోకి తీసుకొస్తుంది అనేదానిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

Post a Comment

0 Comments

Close Menu