భారత్‌లో యాపిల్ ఐఫోన్ల తయారీ కేంద్రం వేగంగా ఎదుగుతున్నది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో సుమారు 6 బిలియన్ డాలర్లు (రూ. 50 వేల కోట్లకుపైగా) విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసినట్లు కథనాలు వస్తున్నాయి. మొత్తంగా 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ ఎగుమతులు దాదాపు 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 85 వేల కోట్ల)ను దాటేయవచ్చని అంచనా. గత ఏడాది విక్రయాలతో పోలిస్తే ఇది మూడోవంతు వృద్ధి సాధించినట్లే. స్థానిక సబ్సిడీలు, నైపుణ్యం ఉన్న ఉద్యోగులను ఉపయోగించుకుని యాపిల్ భారత్‌లో ఐఫోన్ల తయారీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నది. ఇటీవలకాలంలో అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో బీజింగ్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలన్న ఐఫోన్ లక్ష్యాలను సాధించడంలో న్యూఢిల్లీ కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే యాపిల్‌కు ప్రధాన సరఫరాదారులుగా ఉన్న ఫాక్స్‌కాన్, పెగట్రాన్ సంస్థలు టాటా ఎలక్ట్రానిక్స్‌తో జత కట్టాయి. ఫాక్స్‌కాన్ చెన్నై శివార్లలో అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఇక కర్ణాటకలోని టాటా గ్రూప్ ఫ్యాక్టరీ నుంచి ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యలో 1.7 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేశారు. ఈ ఫ్యాక్టరీని విస్ట్రాన్ నుంచి టాటాలు కొనుగోలు చేశారు. భారత్ నుంచి అమెరికాకు అత్యధికంగా ఎగుమతయ్యే రెండో సరుకుగా ఐఫోన్ నిలిచింది. తొలి ఐదు నెలల్లో వీటి విలువ 2.88 బిలియన్ డాలర్లు అని ఫెడరల్ ట్రేడ్ మినిస్ట్రీ డేటా చెబుతున్నది. మరోవైపు భారత మార్కెట్లో మాత్రం యాపిల్ ఫోన్లు 7 శాతం వాటాను మాత్రమే దక్కించుకున్నది. ఇక్కడ కొత్తగా రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. మొదటి స్టోర్‌ను న్యూఢిల్లీలో ఆ సంస్థ ఈసీవో టిమ్‌కుక్ స్వయంగా ప్రారంభించారు. ఇండియాలో ఐఫోన్ల అమ్మకాలు 2023 నాటికి 33 బిలియన్ డాలర్లకు చేరవచ్చని బ్లూమ్‌బెర్గ్ అంచనా వేసింది.
0 Comments