ఏ కంపెనీ అయినా ఒక వస్తువును మార్కెట్లో లాంచ్ చేయాలంటే.. ముందుగా దాని ప్రోటోటైప్ విడుదల చేస్తుంది. ఆ ప్రోటోటైప్ ద్వారానే వస్తువు పనితీరు ఎలా ఉంది అనే విషయం తెలుస్తుంది. అయితే వస్తువుల ఉత్పత్తి ప్రారంభమైన తరువాత, ప్రోటోటైప్స్ నిరుపయోగమవుతాయి. కొన్నేళ్ల తరువాత ఇలాంటి వాటిని సంస్థలు లేదా వ్యక్తులు వేలంలో విక్రయిస్తాయి. ఆసక్తికలిగిన వారు భారీ మొత్తంలో ఖర్చు చేసి వాటిని సొంతం చేసుకుంటారు. 1983 నుంచి మనుగడలో ఉన్న అలాంటి ఒక యాపిల్ ప్రోటోటైప్ 'మాకింతోష్ #ఎమ్001' ఇప్పుడు వేలానికి వచ్చింది/ యాపిల్ మాకింతోష్ #ఎమ్001 ప్రోటోటైప్ అక్టోబర్ 23 వరకు న్యూయార్క్‌లోని బోన్‌హామ్స్‌లో వేలానికి ఉంటుంది. ఇది సుమారు 120000 డాలర్లకు (రూ. 1 కోటి కంటే ఎక్కువ) అమ్ముడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే అత్యంత ఖరీదైన పురాతన యాపిల్ ఉత్పత్తులలో #ఎమ్001 ప్రోటోటైప్ కూడా ఒకటిగా మరో రికార్డ్ క్రియేట్ చేయనుంది. మాకింతోష్ #ఎమ్001 ప్రోటోటైప్ నాలుగు దశాబ్దాలుగా మనుగడలో ఉన్నప్పటికీ.. ఇది మంచి స్థితిలో ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. యాపిల్ ఉత్పత్తులను వేలంలో విక్రయించడం ఇదే మొదటిసారి కాదు. 2019లో ఇలాంటి ఓ ప్రోటోటైప్‌ను 150075 డాలర్లకు విక్రయించారు. కంప్యూటర్లు మాత్రమే కాకుండా స్టీవ్ జాబ్స్, జెఫ్ రాస్కిన్ సంతకం చేసిన 128కే మాకింతోష్ మదర్‌బోర్డ్ 2021లో 132049 డాలర్లకు అమ్ముడైంది. ఆ తరువాత స్టీవ్ జావ్స్ ఉపయోగించిన మాకింతోష్ ఎస్ఈ కంప్యూటర్‌ను 126375 డాలర్లకు వేలంలో విక్రయించారు. దీన్ని బట్టి చూస్తే మాకింతోష్ #ఎమ్001 ప్రోటోటైప్ కూడా భారీ ధరకే అమ్ముడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
0 Comments