బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసిన సంగతి తెలిసిందే. భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే టీటీడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈవో శ్యామల రావు అధికారులతో సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 16న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15న సిఫార్సు లేఖలు అనుమతించకూడదని, భక్తుల భద్రత దృష్ట్యా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఈవో శ్యామలరావు ప్రకటించారు. వర్షాల కారణంగా టీటీడీ చరిత్రలో మొదటిసారిగా బ్రేక్ దర్శనాలు రద్దయ్యాయి. భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఈవో ఆదేశించారు. ఘాట్ రోడ్డులో కొండచరియలపై నిఘా ఉంచాలన్న ఆయన.. జేసీబీలు, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే వేగంగా స్పందించేందుకు అగ్నిమాపక సిబ్బంది ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ ఈవో ఆదేశించారు.
0 Comments