గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 15 అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లను మరింత మెరుగ్గా చేసేందుకు ఇందులో అనేక కొత్త ఫీచర్లను జోడించారు. ప్రైవేట్ స్పేస్ అనేది వర్చువల్ లాకర్. వ్యక్తిగతమైన, గోప్యమైన యాప్‌లను ఇక్కడ ఉంచవచ్చు. ఈ యాప్‌లను మీరు మాత్రమే యాక్సెస్ చేయగలిగేలా భద్రతను ఇస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ఫోన్ ఇచ్చే పేరెంట్స్‌కు ఇది బాగా ఉపయోగపడుతుంది. బ్యాంకింగ్, షాపింగ్ వంటి యాప్‌లు ఇక్కడ సురక్షితంగా ఉంటాయి. ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ జీవిత కాలం తగ్గిపోతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఆండ్రాయిడ్ 15లో 80% లిమిట్ ఆప్షన్ తీసుకొచ్చారు. దీని ద్వారా బ్యాటరీ తొందరగా దెబ్బతినకుండా నివారించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15లో తీసుకొచ్చిన థెఫ్ట్ ప్రొటెక్షన్ ఫీచర్ అసాధారణ చర్యలతో మీ ఫోన్‌ను ఎవరైనా చోరీ చేయడానికి ప్రయత్నించి ఉంటే తెలియజేస్తుంది. ఒక వేళ మీ ఫోన్ చోరీకి గురైతే మీ డేటాను రక్షించడానికి, ఫ్యాక్టరీ రీసెట్ చేయకుండా ఇది ఆటోమేటిక్‌గా లాక్ చేస్తుంది. మీ ఫోన్ నంబర్‌ని ఉపయోగించి వేరొక ఫోన్ నుంచి మీ ఫోన్‌ను లాక్ చేయవచ్చు. కొందరికి రింగ్ టోన్స్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు. అందుకే ఫోన్‌ను వైబ్రేషన్ లేదా సైలెంట్ మోడ్‌లో పెట్టుకుంటారు. మీటింగ్స్‌లో ఉన్నప్పుడు కూడా ఇలాగే చేస్తుంటారు. అయితే దీని వల్ల కొన్నిసార్లు కాల్స్ వచ్చినప్పుడు గుర్తించలేం. దీని పరిష్కారం కోసమే ఆండ్రాయిడ్ 15లో అడాప్టివ్ వైబ్రేషన్ ఫీచర్ ఇచ్చారు. సందర్భానికి అనుగుణంగా దానంతట అదే వైబ్రేషన్‌ను అడ్జెస్ట్ చేస్తుంది. తరచూ స్ప్లిట్ స్క్రీన్ ఉపయోగించేవారి కోసమే ఈ ఫీచర్. ఏవైనా రెండు యాప్‌లను జతగా వినియోగించేవారు వాటిని సేవ్ చేసుకునే అవకాశం ఇందులో ఉంది. వీటిని హెమ్ స్క్రీన్‌పై షార్ట్‌కట్స్‌గా సేవ్ చేసుకోవచ్చు. ఫోన్‌లో స్టోరేజ్ అయిపోయినప్పుడు పాత యాప్‌లను వదిలించుకోవాలి. అయితే యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయడం వలన దాని డేటా మొత్తం పోతుంది. మళ్లీ ఇన్‌స్టాల్ చేస్తే మొదటి నుండి సెటప్ చేయాలి. దీన్ని పరిష్కరించడానికి గూగుల్ గతంలో ప్లేస్టోర్‌కి యాప్ ఆర్కైవింగ్‌ని జోడించింది. ఇప్పుడిదే ఫీచర్‌ను ఆండ్రాయిడ్ 15తో ఇన్‌బిల్ట్‌గా తీసుకొచ్చింది. తొలగించిన యాప్‌ను మళ్లీ ఇన్‌స్టాల్ చేసినప్పడు పాత డేటా అలాగే ఉంటుంది. శాటిలైట్ ద్వారా ఎస్‌ఎంస్‌లు పంపించే ఈ సరికొత్త ఫీచర్‌ను ఆండ్రాయిడ్ 15లో ప్రకటించినప్పటికీ ప్రస్తుతానికి దీన్ని ఉపయోగించలేం. క్యారియర్‌లు ఈ సర్వీస్‌కు ధర నిర్ణయించే పనిలో ఉన్నాయి. దీని కోసం కొంత కాలం వేచి ఉండవలసి ఉంటుంది.
0 Comments