ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త బ్యాంకులో పని చేస్తున్నారని, బ్యాంకులో వేలం వేసిన బంగారు బిస్కెట్లను గతంలో పాడుకున్నానని, డబ్బులు అవసరమైనప్పుడు వాటిని విక్రయిస్తున్నట్లు పలువురిని నమ్మించింది. కిలో బంగారు బిస్కెట్లు రూ.10 లక్షలకే ఇస్తానని ఆశ చూపి నౌపడ, టెక్కలి, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు చెందిన మహిళల నుంచి రూ.కోటి పైగా కాజేసింది. నౌపడ గ్రామానికి చెందిన కె.భాగ్యలక్ష్మి నుంచి రూ.35 లక్షలు, బేబీ నుంచి రూ.20 లక్షలు, దాలమ్మ నుంచి రూ.2 లక్షలు, టెక్కలికి చెందిన పైల దమయంతి నుంచి రూ.37 లక్షలు వసూలు చేసింది. బంగారు బిస్కెట్లు ఇవ్వకపోవడంతో బాధితులు రెండు నెలల కిందట ఆమెను నిలదీశారు. తులం బంగారానికి రెండు తులాల బంగారం అందజేస్తానని.. బంగారం వద్దనుకుంటే డబ్బులు ఇస్తామని మరోమారు ఆశ చూపింది. ఇటీవల బాధిత మహిళలు ఒత్తిడి చేయడంతో టెక్కలి, పలాస, నరసన్నపేట, విశాఖపట్నంలోని బంగారం దుకాణాల్లో బిస్కెట్లు తయారవుతున్నాయని చెప్పింది. నగదు లేదా బంగారం అందకపోవడంతో కొందరు నాయకుల వద్ద కొన్ని రోజుల కిందట పంచాయితీ జరిగింది. మోసం విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు గతంలో కళాశాల ఛైర్మన్‌గా పని చేసిన ఓ వ్యక్తితో పాటు మరొకరు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకు వారు రూ.లక్షల్లో వసూలు చేశారు. దస్తావేజులు, ఈ-స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించడంలో వైకాపా నాయకులు కీలకంగా వ్యవహరించారు. సుమారు పది రోజుల కిందట నౌపడ, టెక్కలి మహిళలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మాయలేడిని పిలిపించగా బాధితులతో రాజీకి వచ్చి కొద్ది రోజుల గడువు కోరారు. ఇటీవల అది పూర్తవడంతో మహిళలు నిలదీస్తే దుర్భాషలాడుతూ ఎదురు దాడికి దిగింది. బాధిత మహిళలు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
0 Comments