ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని విభూతిఖండ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉద్యోగి సదాఫ్ ఫాతిమా (45) పని చేస్తూనే ప్రాణాలు వదిలింది. కుర్చీ పైనుంచి కిందపడిన వెంటనే మరణించింది. దీంతో తోటి ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టానికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు తర్వాత ఫాతిమా మరణంపై స్పష్టత వస్తుందని విభూతిఖండ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాధారామన్ సింగ్ తెలిపారు. అనుమానాస్పద స్థతిలో మరణించినట్లుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పని ఒత్తిడి కారణంగానే ఫాతిమా చనిపోయిందని సహచర ఉద్యోగులు వాపోయారు. ఇక ఇదే అంశంపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ఇది అత్యంత ఆందోళనకర అంశం అని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో కార్యాలయాల్లో పని ఒత్తిడి పెరిగిందని తెలిపారు. కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాలు పని ఒత్తిడిపై పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. తాజా విషాదాన్ని చూసైనా కంపెనీలు, ప్రభుత్వ విభాగాలు ఆలోచించాలని కోరారు. ఇలాంటి ఘటనలు మానవ మనుగడకు తీరని నష్టమని అఖిలేష్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇదిలా ఉంటే ఈవై ఉద్యోగిని మృతిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పిల్లలను చదువుతో పాటే పని ఒత్తిడిని తట్టుకునేలా తయారు చేయాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.
0 Comments