తమిళనాడుకు చెందిన 'శ్రీ అన్నపూర్ణ రెస్టారెంట్' యజమాని శ్రీనివాసన్ ఇటీవల ఆహార పదార్థాలపై జీఎస్టీ విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న జీఎస్టీ గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రశ్నించారు. రెస్టారెంట్లు ఎదుర్కొంటున్న సవాళ్లను తెలియజేశారు. అనంతరం ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన ఆర్థిక మంత్రిని కలిసి క్షమాపణలు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. సదరు వ్యక్తిపై కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని, ఇందుకు గాను సీతారామన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ''అన్నపూర్ణ రెస్టారెంట్ చైన్ యజమాని వ్యవహారంలో నిర్మలా సీతారామన్ తీరు అవమానకరమైనది. పేద మధ్యతరగతి వర్గాల పట్ల జీఎస్టీ పన్ను భూతంలా మారింది. మోడీ ప్రభుత్వ చర్యలతో చిన్న వ్యాపారాల యజమానులు ఆర్థిక దాడులకు గురవుతున్నారు. అధికార అహంకారంతో వారీ విధంగా ప్రవర్తిస్తున్నారు'' అని అన్నారు. వస్తువులపై సరళమైన, ఏకరీతి, హేతుబద్ధమైన జీఎస్టీ అవసరమని కాంగ్రెస్ ముందు నుంచి చెబుతోందన్నారు.
0 Comments