Ad Code

కొందరు నాయకులు ఎక్కువ మాట్లాడుతున్నారు - అది మంచిది కాదు !


ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్‌ పదవులు పొందిన కూటమి పార్టీ నాయకులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పదవులకు వన్నె తెచ్చేలా వ్యవహరించాలని వారికి దిశానిర్దేశం చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడి జైలుకు వెళ్లారని, ఆయనకు పార్టీ నుంచి చేయాల్సి ఉందని, చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయనకు న్యాయం చేస్తామన్నారు. ప్రతిపక్షంలో ఉన్న కాలంలో ఎవరేం చేశారో అన్నీ చూశానని చెప్పారు. ఇవ్వాల్సిన పదవులు చాలా ఉన్నాయన్నారు. వాటిని దశల వారీగా ఇచ్చుకొంటూ వెళ్తామని చంద్రబాబు వెల్లడించారు. పార్టీ అన్న తర్వాత అనేక కోణాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణల వంటివి అనేకం చూడాల్సి ఉంటుందన్నారు. మూడు పార్టీలను కలుపుకొని వెళ్లాలన్నారు. ఎవరికి ఇచ్చే గౌరవం వారికి ఇస్తామని హామీ ఇచ్చారు. తాను, పవన్‌ కల్యాణ్‌ అన్నీ చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అదే సమయంలో పార్టీలో క్రమశిక్షణను అందరూ పాటించాలని సూచించారు. కొందరు నాయకులు ఎక్కువ మాట్లాడుతున్నారని, అది సరికాదని సూచించారు. క్రమ శిక్షణ తప్పితే కఠినంగా ఉంటానని చంద్రబాబు హెచ్చరించారు. మొదటి జాబితా ఇచ్చిన తర్వాత ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేయించామని, 95 శాతం మంది ఈ ఎంపికలపై సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. అవకాశాలు ఇవ్వాల్సిన వాళ్లు ఇంకా అనేక మంది ఉన్నారన్నారు. వారందరికీ వీలు మేరకు అన్నీ చూసుకొంటూ ఇస్తామని చంద్రబాబు వివరించారు. తమకు అప్పగించిన బాధ్యతల్లో కొత్త ఛైర్మన్లు శక్తిమేర పని చేయాలని వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం సహకరించాలని సూచించారు. త్వరలోనే మలి విడత నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu