కర్ణాటకలోని మంగళూరు, కిన్నీగోళి రామనగర్‌లో ఓ మహిళ రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో అటుగా దూసుకొచ్చిన ఓ ఆటో అదుపు తప్పి మహిళపైకి దూసుకెళ్లింది. అయితే రోడ్డుకు ఇవతల వైపున తల్లి కోసం ఎదురు చూస్తున్న స్కూల్ విద్యార్ధిని తల్లిపై ఆటో పడటం చూసి మెరుపు వేగంతో పరుగెత్తుకెళ్లింది. తన చేతులతో ఆటో అమాంతం ఎత్తి తల్లిని కాపాడుకుంది. తల్లిని కాపాడుకోవాలనే తాపత్రయంలో బాలికకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ అంత బరువైన ఆటోను అలవోకగా ఎత్తెసింది. గాయపడిన మహిళను రాజరత్నాపూర్‌కు చెందిన చేతన (35)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన రోజు సాయంత్రం ట్యూషన్ కు వెళ్లిన తన కూతురిని తీసుకురావడానికి చేతన ట్యూషన్ సెంటర్ దగ్గరకు వచ్చింది. రోడ్ దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కటిల్ నుంచి కిన్నిగోలి వైపు వస్తున్న ఆటో అదుపు తప్పి మహిళపై ఆటో బోల్తా పడింది. సరిగ్గా కూతురు ఎదురుగానే ఆటో తల్లిని ఢీకొట్టింది. ఘటన అనంతరం అదే ఆటోలో మహిళను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తోపాటు అందులోని ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు స్థానిక దుకాణంలోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ఎంతో ధైర్య సాహసాలతో తల్లిని ఆటో ప్రమాదం నుంచి కాపాడిన బాలికను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.
0 Comments