కోల్ కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఘటన దేశంలో అందరిని కలిచివేసింది. ఈ హత్యాచార ఘటనతోపాటు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో సొంత పార్టీకి చెందిన ఎంపీ, అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత జవహర్ సిర్కార్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతటితో ఆగకుండా ఈ మేరకు పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి ఘాటుగా లేఖను రాశారు. కోల్ కతా ఘటన తర్వాత మమతా ప్రవర్తించిన తీరు అంతగా ఆమోద యోగ్యంగా లేదన్నారు. ముఖ్యంగా.. విద్యార్థుల మనోభావాలను పట్టించుకోకుండా.. ఆమె అణచివేతలకు పాల్పడ్డారన్నారు. విద్యార్థులపై భాష్పవాయులు, వాటర్ కెన్ లలో దాడులు చేయడం ఘోరమన్నారు. గత కొన్ని నెలలుగా.. సీఎం మమతా బెనర్జీతో భేటీ అయి మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా.. అవకాశమే ఇవ్వడం లేదని జవహర్ సిర్కార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన పలువురు ఉన్నతాధికారులు కీలక పదవుల్లో కొనసాగుతున్నారన్నారు. వైద్యురాలిపై హత్యాచారం అనంతరం రాష్ట్రంలో జరిగిన ఆందోళనలతో.. ఈ ప్రభుత్వ వెనుక ప్రజలు లేరనే విషయం స్పష్టమైందని చెప్పారు. ఈ హత్యాచార ఘటన అనంతరం మమతా బెనర్జీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు శూన్యమని ఎంపీ జవహార్ సిర్కార్ విమర్శించారు. తాను ఎంపీగా ఉన్న ఈ మూడేళ్లలో. పెద్దల సభలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను లేవనెత్తిన విషయాన్ని ఈ సందర్బంగా జవహర్ సిర్కార్ గుర్తు చేశారు. తన పోరాటమంతా అవినీతితోపాటు.. మతతత్వంపైన కూడా చేశానంటూ ఈ సందర్భంగా జవహర్ స్పష్టం చేశారు. మరోవైపు ఆర్ జీ కర్ కాలేజీ వైద్యురాలు హత్యాచారం ఘటన నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించిన తీరుతో పాటు.. ఆ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు.
0 Comments