
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన కౌంటర్‌కి కేటీఆర్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. "పొంగులేటి తీరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించింది. పొంగులేటి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంతే రాజీనామా చేయాల్సి వస్తుంది. రాజీనామా చేయాల్సిన దగుల్బాజీలు ఈ ముఖ్యమంత్రి, ఆయన మంత్రులే. ఈ ప్రభుత్వంలోని మంత్రులకు చట్టాలు మాత్రమే కాదు, చుట్టరీకాలు కూడా తెలిసినట్టు లేదు. భార్య తమ్ముడు బావమరిది కాకుండా ఇంకేం అవుతాడో పొంగులేటి చెప్పాలి. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్‌తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లను కూడా నేను ప్రస్తావించడంతో పొంగులేటి ఆగమేఘాల మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. రూ.1,137 కోట్ల అవినీతి జరిగినా, ఒక్క రూపాయి అవినీతి జరిగినా ఈ చట్టం వర్తిస్తుందనే విషయం ఆయన తెలుసుకోవాలి. పొంగులేటికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్దాం. గంతంలో ఉన్న ఫైల్స్‌తో పాటు ఇప్పుడు జరిగిన టెండర్ల వ్యవహారం పైన వివరాలు ఉంచుదాం. ఆయన న్యాయంగా తీర్పు చెప్పిన తర్వాత నేను చెప్పింది అబద్ధమంటే రాజీనామా కాదు రాజకీయ సన్యాసం చేస్తా. లేదంటే కేంద్రంలోని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లేదా మరేదైనా ఏజెన్సీ దగ్గరకైనా వెళ్దాం" అని కేటీఆర్ సవాల్ విసిరారు. "ముఖ్యమంత్రి అధ్వర్యంలో జరిగిన ఈ టెండర్ల వ్యవహారంలో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రికీ, మంత్రి పొంగులేటికీ తెలుసు. ఆశ్రిత పక్షపాతం లేకుండా బంధువులకు అక్రమంగా లాభం చేయను అని ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ అవినీతికి పాల్పడ్డారు. కేవలం రెండు కోట్ల లాభం ఉన్న బావమరిది కంపెనీకి రూ.1,000 కోట్ల కాంట్రాక్టు ఇచ్చి అవినీతి జరగడం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని, ఈ బరితెగింపు మాటలు మానివేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి భార్యకి సూదిని సృజన్ రెడ్డి బంధువు కాదు, ఆమెకు స్వయానా సోదరుడు. సొంత బావమరిదిని పట్టుకుని కేవలం అవినీతి కోసం, టెండర్ల కోసం సంబంధం లేదని చెప్తారా? పొంగులేటికి దమ్ముంటే విచారణ సంస్థల ముందుకు లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందుకు రావాలి. ఇప్పటికైనా జరిగిన తప్పును ఒప్పుకొని ముఖ్యమంత్రి జరిగిన టెండర్లను వెంటనే రద్దు చేయాలి. లేకుంటే గతంలో సోనియా గాంధీ, అశోక్ చావాన్, యడ్యూరప్ప పదవులు పోయినట్లు మీ పదవులు కూడా పోతాయి" అని కేటీఆర్ అన్నారు. "త్వరలో మరోసారి పొంగులేటి సంస్థకు దక్కిన కొడంగల్ ఎట్టిపోతల కాంట్రాక్టుల గురించి మాట్లాడుతాను. ముఖ్యమంత్రి బావమరిదికి టెండర్లు, మంత్రికి టెండర్లు, సిగ్గు లేకుండా ఢిల్లీకి కప్పం కట్టేందుకు ఈ భారీ అవినీతికి ప్రభుత్వం తెగబడింది. ప్రజల తరఫున.. ప్రభుత్వ మంత్రులు, ముఖ్యమంత్రి అవినీతిని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం. చీఫ్ జస్టిస్ కానీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కానీ, నేను చెప్పింది తప్పని చెప్తే రాజీనామా కాదు రాజకీయ సన్యాసం చేస్తా. పొంగులేటి గతంలో కాంట్రాక్టర్‌గా ఉండొచ్చు కానీ, ఈరోజు మంత్రిగా ఉండి కాంట్రాక్టులు సంపాదించడం ముమ్మాటికీ చట్టవ్యతిరేకమే. అమృత్ టెండర్లలో తప్పు జరిగిందా లేదా అని తేల్చడానికి మీ ప్రభుత్వ అధికారులు అంతా కలిసి ముఖ్యమంత్రితో సహా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ముందుకు పోదాం. ఢిల్లీకి వెళ్లే తేదీనీ, సమయాన్నీ ముఖ్యమంత్రి చెప్పాలి" అని కేటీఆర్ డిమాండ్ చేశారు. "ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధుల వ్యవహారాలకు సంబంధించిన అంశంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ మొదలుకొని ఒక్క ఎంపీ కూడా మాట్లాడటం లేదు. కేంద్ర ప్రభుత్వ నిధుల్లో అవినీతి జరుగుతున్నా ఒక్క మాట కూడా బీజేపీ మాట్లాడటం లేదు. అధికారంలోకి వచ్చిన 9 నెలలోనే ముఖ్యమంత్రి సోదరుడు అనుముల జగదీశ్ రెడ్డి వెయ్యికోట్లు పెట్టే స్థాయికి.. రేవంత్ రెడ్డి బావమరిది సూదిని సృజన్ రెడ్డి రూ.2 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టే స్థాయికి ఎలా పోయారో రేవంత్ రెడ్డి చెప్పాలి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుతున్నాను. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అవినీతిపైన మా దగ్గర సమాచారం ఉంది. ఈ ప్రభుత్వ అవినీతిని వరుసగా బయటపెడతాం. న్యాయస్థానాలను కూడా ఈ ప్రభుత్వం తప్పు దోవ పట్టిస్తోంది. ఫార్మసిటీ రద్దు అని ముఖ్యమంత్రి చెప్తారు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్తారు. కానీ న్యాయస్థానాల్లో మాత్రం అసత్యపూరితమైన సమాచారంతో కూడిన పత్రాలను సమర్పిస్తారు. మా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని, బయటేమో కండువాలు కప్పి, పార్టీలో చేర్చుకోలేదని అధికారికంగా చెబుతున్నారు" అని కేటీఆర్ మండిపడ్డారు.
0 Comments