టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. టీడీఎస్ క్లెయిమ్‌లలో వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 143(1) ప్రకారం ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది. 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఉద్యోగులకు కట్ చేసిన టీడీఎస్‌లలో కొంత భాగం ఆదాయపు పన్ను శాఖ రికార్డులలో నమోదు కాలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసుల్లో డిమాండ్ చేసిన మొత్తాలు రూ.50,000 నుంచి రూ.1,45,000 వరకు ఉన్నాయి. టీడీఎస్ వ్యత్యాసాలపై వడ్డీ, ఛార్జీలను సైతం నోటీసుల్లో పేర్కొన్నారు. ట్యాక్స్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యల కారణంగా టీడీఎస్ క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ కాకపోయి ఉండవచ్చని టీసీఎస్ ఉద్యోగి ఒకరు తెలిపారు. తాము క్లెయిమ్స్‌ను మ్యాన్యువల్ సమర్పించాల్సి వచ్చిందని, సిస్టమ్‌లో నమోదు కాని టీడీఎస్ మొత్తానికి సంబంధించి ఐటీ శాఖ నోటీసులు పంపిందని ఆ ఉద్యోగి వివరించారు. టీడీఎస్ రికార్డుల్లోని వ్యత్యాసాల కారణంగా చాలా మంది ఉద్యోగులకు ఆదాయపు పన్ను రీఫండ్‌లు ఆలస్యం అయ్యాయి. ఆదాయపు పన్ను శాఖ నుండి ప్రాథమిక అంచనా ఆందోళన కలిగించింది. సమస్యలను సరిదిద్దే వరకు ట్యాక్స్ రీఫండ్‌లో మరింత జాప్యం జరుగుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. డిమాండ్ నోటీసులు ఉన్నప్పటికీ, పన్ను అధికారుల ద్వారా రీప్రాసెసింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని టీసీఎస్ తమ ఉద్యోగులకు ఇంటర్నల్ ఈ-మెయిల్స్‌లో తెలియజేసింది.
0 Comments