హైదరాబాద్ లోని ఖైరతాబాద్ భక్త జనసంద్రంగా మారింది. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి మహాగణపతి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఖైరతాబాద్ ప్రాంతం కిటకిటలాడుతోంది. రేపు గణేశ్ నిమజ్జన కార్యక్రమం ఉండటంతో ఇవాళ అర్ధరాత్రి వరకే దర్శనానికి అనుమతిస్తామని ఉత్సవ కమిటీ ప్రకటించింది. దీంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఐమ్యాక్స్ వైపు నుంచి జనం భారీగా తరలివస్తున్నారు. బారికేడ్లు తొలగించడంతో రద్దీని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. క్యూలైన్‌లో ఉన్న ఓ వృద్ధుడు ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయాడు. గణేశ్ విగ్రహం కూడలిలో కాలు కదపలేని పరిస్థితి నెలకొనడంతో మహిళలు, చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. వర్షంలో తడుస్తూనే భక్తులు గణపయ్యను దర్శించుకుంటున్నారు.
రేపు అర్ధరాత్రి 2గంటల వరకు మెట్రో రైళ్లు
గణేశ్ నిమజ్జనం దృష్ట్యా మెట్రోరైలు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల 17న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని హైదరాబాద్ మెట్రోరైల్ సంస్థ వెల్లడించింది. చివరి స్టేషన్లో నుంచి రాత్రి ఒంటిగంటకు చివరి రైలు బయలుదేరుతుందని పేర్కొంది. నిమజ్జనం ముగిసే వరకు అవసరాన్ని బట్టి అదనపు రైళ్లు నడుపుతామని తెలిపింది. మరో వైపు ఆదివారం ఖైరతాబాద్ గణపతి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో మెట్రో స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. నిన్న ఒక్క రోజే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ను 94 వేల మంది ప్రయాణికులు వినియోగించుకున్నారు.
0 Comments