నాగార్జున సాగర్, సుంకిశాల ఘటన చిన్నదని, నష్టం కూడా తక్కువేనని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని గుత్తేదారు భరిస్తారని, ప్రజలకు, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని చెప్పారు. హైదరాబాద్‌కు తాగునీరు అందించే సుంకిశాల ప్రాజెక్టు వద్ద నిర్మాణంలో ఉన్న పంప్‌హౌస్ నీట మునిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్, తుమ్మల నాగేశ్వరరావు, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. టన్నెల్ ముందు భాగంలో నిర్మాణంలో ఉన్న గేటుతోపాటు రక్షణ గోడలోని ఒక ప్యానెల్ కొట్టుకుపోయిందని, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు మరో 2 నెలల అదనపు సమయం పడుతుందన్నారు. ''ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేస్తాం. డిండి ఎత్తిపోతల పథకం కూడా పూర్తి చేస్తాం. సుంకిశాల పనులు భారాస హయాంలో జరిగాయి. ఈ ఘటన సోషల్ మీడియా ద్వారానే ప్రభుత్వానికి తెలిసింది. వెంటనే ప్రభుత్వం స్పందించింది. వాటర్ వర్స్క్ సిబ్బంది విచారణ చేస్తున్నారు. సీఎంతో చర్చించి తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయిస్తాం'' అని ఉత్తమ్‌కుమార్ తెలిపారు.
0 Comments