తమ సౌలభ్యం కోసం బ్యాంకింగ్ యాప్ లను వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. వీటి ద్వారా బ్యాంకుకు వెళ్లకుండానే వారి పని పూర్తి అవుతుంది. ఈ యాప్ ల సహాయంతో ప్రజల సమయం ఆదా అవుతుంది కానీ ప్రైవసీకి భంగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దేశంలోని 70 శాతం కంటే ఎక్కువ ఫిన్టెక్, బ్యాంకింగ్ యాప్ లు తమ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయగలవని ఒక నివేదిక వెల్లడించింది. కాబట్టి యూజర్లు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వినియోగదారులు తమ మొబైల్లో యాప్ ను డౌన్ లోడ్ చేసినప్పుడల్లా యాప్ అనేక యాక్సెస్ ల కోసం అనుమతిని అడుగుతుంది. వాటిని యూజర్ ఇస్తేనే ఆ యాప్ వర్క్ మొదలవుతుంది. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈ యాప్ లు వినియోగదారుల ప్రైవేట్ వివరాలను యాక్సెస్ చేస్తాయి. ఇందులో వినియోగదారుడి కాంటాక్ట్స్, లొకేషన్, ఫోటోలు, వీడియోలు, మైక్రోఫోన్, ఎస్ఎంఎస్ మొదలైనవి ఉంటాయి. యూజర్ల ప్రైవసీకి సంబంధించి ఆర్బీఐ చేసిన విశ్లేషణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్బీఐ తెలుపుతున్న దాని ప్రకారం 339 ఫిన్టెక్, బ్యాంకింగ్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో లిస్ట్ అయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కరెన్సీ, ఫైనాన్స్ పై విడుదల చేసిన నివేదికలో ఇవి అత్యంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ను ట్రాక్ చేస్తున్నట్లు తెలిసింది. నివేదిక ప్రకారం 73 శాతం యాప్ లు వినియోగదారుల లొకేషన్ ను ట్రాక్ చేస్తాయి. అయితే మూడు వంతుల కంటే ఎక్కువ యాప్ లు ఫోటోలు, మీడియా, ఫైల్లు, స్టోరేజ్ కోసం డేటా పర్మిషన్లను వినియోగదారులను కోరాయి. యాక్సెస్ పొందడమే కాకుండా ఈ యాప్ లు యూజర్ లొకేషన్ ను కూడా ట్రాక్ చేస్తాయి. అంటే యూజర్ ఎక్కడికి వెళ్లినా యాప్ అతనిని ట్రాక్ చేస్తూనే ఉంటుంది. యూజర్ ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా యాప్ లో మొత్తం సమాచారం ఉంటుంది. మొబైల్ వాలెట్లు అత్యంత సెన్సిటివ్ పర్మిషన్లను కోరతాయని ఈ నివేదిక పేర్కొంది.
0 Comments