బీఎస్ఎన్ఎల్ 5జీ రెడీ సిమ్ కార్డులను ప్రవేశపెట్టింది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో యూజర్స్ కి మెరుగైన కనెక్టివిటీ, వేగవంతమైన ఇంటర్నెట్ ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది బీఎస్ఎన్ఎల్ సంస్థ. గత సిమ్ కార్డులతో పోలిస్తే ఈ 5జీ సిమ్ కార్డు భిన్నంగా ఉంది. సిమ్ కార్డు మీద జాతీయ పతాకం ఉంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని రాసి ఉంది. అలానే 5జీ అనే పదాన్ని త్రివర్ణ పతాకంలోని మూడు రంగులతో డిజైన్ చేశారు. ఈ సిమ్ కార్డు మూడు సైజుల్లో లభిస్తుంది. రెగ్యులర్, మైక్రో, నానో ఇలా అన్ని ఫోన్లకి సూట్ అయ్యేలా దీన్ని తీసుకొచ్చారు. ఫీచర్ ఫోన్ లో ఫుల్ సైజ్ సిమ్ కార్డుగా, స్మార్ట్ ఫోన్స్ లో మైక్రో, నానో సిమ్స్ గా వాడుకునేలా మూడు రకాల సిమ్స్ ని తీసుకొచ్చారు. అయితే 5జీ నెట్ వర్క్ లేకుండా ఈ బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డుని ఏం చేసుకోవాలి అన్న సందేహం మీకు వచ్చే ఉంటుంది. ఈ 5జీ రెడీ సిమ్ కార్డుని తీసుకోవడం వల్ల 5జీ నెట్వర్క్ లాంఛ్ అయిన మరుక్షణమే 5జీ సేవలను పొందవచ్చు. బీఎస్ఎన్ఎల్ సంస్థ వీలైనంత త్వరగా 5జీ నెట్వర్క్ ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే ఈ 5జీ సిమ్ కార్డులను లాంఛ్ చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆల్రెడీ ఉన్న బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు 5జీ రెడీ సిమ్ కార్డు కోసం అప్ గ్రేడ్ అయ్యే వెసులుబాటు కల్పిస్తుందో లేదో అనే దాని గురించి ఎటువంటి సమాచారం లేదు. కానీ బీఎస్ఎన్ఎల్ సంస్థ కొత్తగా వచ్చే కస్టమర్ల కోసం.. వేరే నెట్వర్క్ ల నుంచి పోర్ట్ పెట్టుకునే వారి కోసం 5జీ సిమ్ కార్డులను ఏపీ, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో విక్రయిస్తోంది. 5జీ సిమ్ కార్డు కావాలనుకునే కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ స్టోర్స్ ని గానీ ఆధరైజ్డ్ డీలర్స్ ని సంప్రదించాల్సి ఉంటుంది. నేరుగా చేతికి 5జీ సిమ్ కార్డుని ఇస్తారు. 4జీ నుంచి 5జీకి మార్పు అనేది వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా స్మూత్ గా ఉంటుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ప్రస్తుతానికైతే బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలను అందించడం లేదు కానీ రానున్న రోజుల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4జీ నెట్ వర్క్ ను విస్తరించుకుంటూ వస్తుంది. 5జీ టెక్నాలజీ వల్ల ఇంటర్నెట్ వేగంగా అవ్వడమే కాకుండా.. కనెక్టివిటీ, స్పీడ్ లో రాజీపడకుండా ఎక్కువ డివైజ్ లకి సపోర్ట్ చేస్తుంది. 4జీతో పోలిస్తే 5జీ ఇంటర్నెట్ వేగంగా ఉండడమే కాకుండా ఆన్ లైన్ గేమింగ్, స్ట్రీమింగ్ కి బాగా ప్రయోజనకరంగా ఉంటుంది.
0 Comments