అత్యంత జనాదరణ పొందిన రూ.395, రూ.1,559 ప్రీపెయిడ్ ప్లాన్లను జియో రద్దు చేసింది. రిలయన్స్ జియో కంపెనీకి దేశంలో వినియోగదారులు చాలా ఎక్కువ. ఈ కంపెనీ చాలా తక్కువ ధరలకే రీచార్జి ప్లాన్లు అమలు చేసింది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తోంది. అపరిమిత కాల్స్, మెరుగైన డేటా ప్యాక్, అపరిమిత 5జీ డేటా సేవలతో దూసుకుపోతోంది. అయితే కొత్తగా తీసుకున్న ధరల పెంపు నిర్ణయంతో వినియోగదారులు విస్మయానికి గురయ్యారు. తాజాగా జరిగిన మార్పులతో రిలయన్స్ జియో అపరిమిత 5జీ ప్లాన్‌లను నిలిపివేసింది. ఇది ఖాతాదారులలో చర్చనీయాంశమైంది. రీచార్జి కోసం అదనంగా ఖర్చుచేయాల్సి రావడంతో ఆందోళన వ్యక్తమైంది. భారతీయ మొబైల్ మార్కెట్ లో మార్పులకు కారణమైంది. జియో కొత్త రీచార్జి ప్లాన్ల ధరలు జూలై 3 నుంచి అమలులోకి వచ్చాయి. జియో గతంలో అందించిన రూ.395 ప్లాన్ కు 84 రోజుల పాటు చెల్లుబాటు అయ్యేది. అలాగే రూ.1,559 ప్లాన్ 336 రోజుల పాటు సేవలు అందించేంది. ఈ రెండిటి నుంచి అపరిమిత 5జీ డేటాను వాడుకోవడానికి అనుమతి ఉండేది. ఈ నేపథ్యంలో ఈ ప్లాన్లను వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించేవారు. కొత్త రేట్ల ప్రకారం జియో బేస్ ప్లాన్ 22 శాతం పెరిగింది. అన్ని రకాల ప్లాన్లకు వీటిని వర్తింపచేసింది. ఆ ప్రకారం జియో రీచార్జుల ధరల వివరాలు తెలుసుకుందాం. ఈ ప్లాన్లలో అపరిమిత కాల్స్ ఉచితం. ప్యాక్ ఆధారంగా డేటా మారుతుంది. గతంలో రూ.155 రీచార్జి ప్లాన్ ద్వారా 28 రోజుల పాటు 2 జీబీ డేటా లభించేంది. ధరలు పెంచిన తర్వాత దాని ధర రూ.189కి పెరిగింది. గతంలో రూ.209తో రీచార్జి చేసుకుంటే 28 రోజుల పాటు రోజుకు వన్ జీబీ డేటా లభించేది. అప్పుడు దాని కోసం రూ.249 ఖర్చు చేయాలి. ప్రస్తుతం రూ.299తో రీచార్జి చేసుకుంటే రోజుకూ 1.5 జీబీ డేటా లభిస్తుంది. గతంలో దీని ధర రూ.239 మాత్రమే. రోజుకు 2 జీబీ డేటా కావాలంటో రూ.349తో రీచార్జి చేసుకోవాలి. గతంలో రూ.299లకు ఈ సేవలు లభించేవి. రిలయన్స్ జియో తన వార్షిక ప్లాన్లలో (365 రోజులు) కూడా అనేక మార్పులను తీసుకువచ్చింది. వాటి ధరలను కూడా విపరీతంగా పెంచింది. రోజూ 2.5 జీబీ డేటా అందించే 365 రోజుల వార్షిక ప్లాన్ ధరను మార్పు చేసింది. గతంలో కంటే రూ.600 పెంచింది. ఇప్పుడు ఈ ప్లాన్ కావాలంటే రూ.3,599తో రీచార్జి చేసుకోవాలి.
0 Comments